Corona : కరోనా డేంజర్ బెల్స్…పిల్లల్లో పెరుగుతున్న కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Children
corona cases in children : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతమున్న వంద యాక్టివ్ కేసుల్లో 7 కేసులు 10 ఏళ్ల లోపు చిన్నారులవే ఉండటం చూస్తుంటే రాబోయే ముప్పుకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏం లేకపోయినా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని నిపుణులు అంటున్నారు.
కరోనా థర్డ్ వేవ్ టార్గెట్ చేసేది పిల్లలనే.. అని చాలా రోజులుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.. ఇప్పుడీ వాదనలను నిజం చేసేలా పలు నివేదికలు వస్తున్నాయి.. ప్రస్తుతం కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గినా మొత్తం కేసుల్లో 10 ఏళ్లలోపు పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చ్‌లో 2.8 శాతం ఉన్న కేసుల నమోదు సంఖ్య ఆగస్టు వచ్చే సరికి 7.04 శాతానికి పెరిగింది.. అంటే ప్రస్తుతమున్న వంద యాక్టివ్ కేసుల్లో ఏడుగురు 10 ఏళ్లలోపు చిన్నారులే ఉన్నారు. పెద్దల్లో వైరస్ ఎఫెక్ట్ తగ్గడమే పిల్లల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు.. అదే సమయంలో కరోనాపై అవగాహన, టెస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం కూడా కారణం కావచ్చంటున్నారు..
Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!
జూన్ 2020 నుంచి 2021 ఫిబ్రవరి వరకు చిన్నారుల్లో కేసుల నమోదు సంఖ్య 2.72 నుంచి 3.59 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.. ఈ కేసుల నమోదు సంఖ్య కేరళ, అండమాన్ నికోబార్ దీవులు సహా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.. అత్యధికంగా మిజోరాంలో యాక్టివ్ కేసుల్లో 16.48 శాతం పిల్లలే ఉన్నారు.. ఆ తర్వాత మేఘాలయాలో 9.35 శాతం, మణిపూర్ 8.74 శాతం, కేరళ 8.62 శాతం, అండమాన్ నికోబార్ 8.2 శాతం, సిక్కిం 8.02 శాతం, అరుణాచలం ప్రదేశ్ 7.38 శాతం మంది చిన్నారులు ఉన్నారు.. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇది 7.04 శాతం ఉంది.. దేశవ్యాప్తంగా 10 ఏళ్లలోపు చిన్నారుల దేశ జనాభా 17 శాతంగా ఉంది..
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. ఈ వైరస్ ఇప్పుడు పిల్లలపై కూడా తన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. పిల్లల్లో పాజిటివిటి రేటు 57-58 శాతంగా ఉందని సీరో సర్వే గణంకాలు చెబుతున్నాయి.. అదే 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ఇది 67 శాతం వరకు ఉంది. అయితే ఈ వైరస్ పెద్దల్లో చూపుతున్నంత ప్రభావం పిల్లల్లో చూపడం లేదన్నది సంతోషించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు.. కరోనా కారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రిల్లో చేరే సంఖ్య పెరిగినా కానీ.. మరణాలు మాత్రం జరగడం లేదు.. దీనికి కారణం గత వేవ్‌ల నుంచి నేర్చుకున్న పాఠాలు.. వైరస్ ప్రభావం అంతగా లేకపోవడం అంటున్నారు.