india coronavirus : 5 రాష్ట్రాల్లోనే వైరస్ ప్రభావం

కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూడా 30 దాటింది. దీంతో దక్షిణ రాష్ట్రాల్లో కరోనా కలవరం పెరిగింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. బాధితుల సంఖ్య పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాలు కోవిడ్ రాకాసితో యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. మర్కజ్ లింక్స్‌తో ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి.
1 ) తెలంగాణలో
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మర్కజ్ సదస్సుకు హాజరైన వారితో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం కొత్తగా మరో 30 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 364కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 308 యాక్టివ్ కేసులుండగా.. 45 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11 మంది కరోనా కాటుకు బలయ్యారు.(కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నయా స్కెచ్)
2 ) ఆంధ్రప్రదేశ్‌లో
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా రాకాసి చాప కిందనీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం కొత్తగా ఏపీలో 37 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 303కు పెరిగింది. కర్నూలు జిల్లాలోనే కొత్తగా 18 కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఇక నెల్లూరులో 8, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనాకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కనీస మొత్తంగా 16 వేల నుంచి గరిష్టంగా 2 లక్షల 16 వేలల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.
3 ) తమిళనాడులో
తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే అక్కడ కొత్తగా 50 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 48 మంది ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారేనని తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్కు దాటి 621కి చేరింది. వీరిలో 570 మంది ఢిల్లీ మత సమావేశానికి వెళ్లిన వారు కాగా.. కేవలం 51 మంది మాత్రమే ఇతరులు ఉన్నారు. తమిళనాడులో కోవిడ్ మహమ్మారికి ఐదుగురు బలయ్యారు.
4 ) కేరళలో
ఇక కేరళలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 327 కేసులు నమోదయ్యాయి. ఇందులో 266 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటికే కేరళలో 59మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరిని కరోనా రాకాసి బలితీసుకుంది.
5 ) కర్నాటకలో
ఇక కర్నాటకలోనూ కరోనా భూతం ప్రతాపం చూపుతోంది. కర్నాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 163 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 139 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడిన 20మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే నలుగురు మాత్రం కరోనా మహమ్మారికి బలైపోయారు.