ర్యాలీకి నేతల క్యూ : మమత మెగా షో

పశ్చిమబెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగత్‌బంధన్ ర్యాలీకి అంతా సిధ్దమైంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఏకం చేయడం..తన సత్తాని చాటడం అనే రెండు లక్ష్యాలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కూటమి సభకి అటు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్న పార్టీలు, కాంగ్రెస్ అంటే పడని పార్టీలు కూడా హాజరు అవుతున్నాయ్. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కోల్‌కతాకు చేరుకున్నారు. కొన్ని థర్డ్ ఫ్రంట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.
మమతా ర్యాలీకి కాంగ్రెస్ మద్దతు
కాంగ్రెస్ తరపున ప్రతినిధులను పంపుతున్న రాహుల్
ర్యాలీకి మాయావతి హాజరు అనుమానం
ర్యాలీకి హాజరవుతున్న కేజ్రీవాల్
రాహుల్ గాంధీ మాత్రం హాజరు కావడం లేదు. ప్రతినిధులను మాత్రం పంపుతున్నా..అంటూ చెబుతున్నారు. దీనితో మాయావతి పాల్గొంటారా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మమత ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో మాత్రం పొత్తు వద్దంటున్నారు. తమిళనాడు నుంచి డిఎంకే అధినేత స్టాలిన్ హాజరవుతున్నారు.
ఐక్యతర్యాలీలో శతృఘ్నసిన్హా
బిజెపినుంచి బైటికి పంపితే కానీ పోనని భీష్మించుకుని కూర్చున్న శతృఘ్నసిన్హా ఐక్యతర్యాలీలో షో స్టాపర్ కానున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బిజెపికి లాయల్‌గా ఉంటానంటూనే ఆయన ర్యాలీకి వెళ్లడమే ఇందుకు నిదర్శనం. జేడిఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామి కూడా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారు. ఎన్సీపీ, జార్ఘండ్ ముక్తిమోర్చా, ఆర్ఎల్జీ, ఆర్జెడీ నేతలు కూడా ర్యాలీలో పాల్గొన్ని మోడీ వ్యతిరేక నినాదం విన్పించనున్నారు.
కోల్‌కతాకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
పలువురు జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ
మమతా నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు
సమావేశానికి నేతృత్వం వహించనున్న చంద్రబాబు
తర్వాత ర్యాలీ ఏ రాష్ట్రంలోనే అనేదానిపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాత్రి కోల్‌కతాకు చేరుకున్నారు. బాబు బృందానికి తృణమూల్ ఎంపీలు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామి, అస్సాం మాజీ సీఎం ప్రఫుల్లకుమార్ మహంతి, అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం జి.అపాంగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. మమతా నిర్వహిస్తున్న ర్యాలీ అనంతరం చంద్రబాబు.. జాతీయ స్థాయి నేతలతో నిర్వహించే కీలక సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. తర్వాత ర్యాలీ ఏ రాష్ట్రంలో చేపట్టాలి అనే అంశంపై ఇందులో చర్చించనున్నారు.
జాతీయ నేతలందరితో చంద్రబాబు మంతనాలు
భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్న నేతలు
జాతీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన చంద్రబాబు
ఫిబ్రవరిలో ఏపీలో ధర్మపోరాట సభ
ఈ ర్యాలీ తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో చివరి ధర్మపోరాట సభను నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ సభకు కూటమి నాయకులందరినీ అమరావతికి ఆహ్వానించాలన్నది చంద్రబాబు ఆలోచన. దీనిపై జనవరి 19వ తేదీన జాతీయ నేతలతో చర్చించనున్నారు.