విమానం కూలినప్పుడు భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం

  • Published By: bheemraj ,Published On : August 8, 2020 / 07:56 PM IST
విమానం కూలినప్పుడు భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం

Updated On : August 8, 2020 / 8:37 PM IST

కేరళలోని కోళీకోడ్‌ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్‌ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది.

ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుమంది క్యాబిన్ క్రూ ఉన్నారు. ప్రమాదానికి గురై విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ దుర్ఘటన తీవ్రమైన వేదనను మిగిల్చింది.

‘ఇది చాలా పెద్ద విషాదం. విమానం నేలపై కూలినప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మమ్మల్ని మేము సమన్వయం చేసుకోవడానికి మా ముందు సీట్లను భయంతో గట్టిగా పట్టుకున్నాం. ఇక విమానం కూలిపోవటంతో అది రెండు ముక్కలుగా విరిగిపోయింది’ అని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు.

‘చుట్టు పక్కల అందరూ ఏడుస్తున్నారు. పైలట్లు, ఇద్దరు మహిళలు మృతి చెందారని ఎవరో నాకు చెప్పారు. ఆ తర్వాత పేపర్‌లో 18 మంది చనిపోయినట్లు వచ్చింది. బహుశా ఈ ప్రమాదానికి వాతావరణం కారణం కావొచ్చని మరో బాధితుడు తెలిపారు.

ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోతే మరో విమాశ్రయంలో ల్యాండ్‌ చేయల్సింది. కానీ ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక కలలా విమానం కూలి ప్రమాదం జరిగింది’ అని మరొక ప్రయాణికుడు పేర్కొన్నారు.

ఐదుగురు బాధితులను విమ్స్‌ ఆస్పత్రిలో చేర్చినట్లు డాక్టర్‌ మహమ్మద్‌ షఫీ వెల్లడించారు. చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ సత్య ప్రధాన్‌ తెలిపారు.