Lalu Prasad Yadav : కుటుంబ కలహాలపై లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఎన్నిక
Lalu Prasad Yadav : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని
Lalu Prasad Yadav
Lalu Prasad Yadav : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 145 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాల్లో విజయం సాధించింది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై పడింది. ఆయన కుటుంబంలో అంతర్గత కలహాలు బయటకొచ్చాయి. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది. తాజాగా.. కుటుంబంలో విబేధాలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యకు మద్దతు ప్రకటించారు. రోహిణి ఆచార్య పట్ల తమ కుటుంబం వ్యవహరించిన తీరు అంగీకరించలేనిదని వ్యాఖ్యానించారు.
లాలూ కుటుంబంలో నెలకొన్న అంతర్గత కలహాల వ్యవహారం ఆర్జేడీలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న క్రమంలోనే.. పాట్నాలో పార్టీ శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తేజస్వీ యాదవ్‌ను ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
‘తమ కుటుంబ సమస్యల్లో అతిగా జోక్యం అనవసరపు చర్యగా లాలూ అభివర్ణించారు. తమ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టడం ఆపేసి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదంటూ హితవు పలికారు. నేను ఉన్నా.. అంతా చూసుకుంటా. ఇది మా కుటుంబ సమస్య.. ఆ సమస్యలను నేను డీల్ చేసుకుంటా అంటూ లాలూ పేర్కొన్నారు. ఫ్యామిలీ సమస్యలను పార్టీ వరకూ తీసుకెళ్లడం మంచిదికాదు. అంతర్గత కలహాలపై కాకుండా, పార్టీ ఐక్యత, పార్టీ పనితీరును మెరుగుపర్చడంపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలు, క్యాడర్ కు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు.
