దేవుళ్లకే పరీక్ష: దేశానికే దేవుడిగా వినాయకుడు

దేవుళ్లకే పరీక్ష: దేశానికే దేవుడిగా వినాయకుడు

‘భారత దేశానికి జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ జంతువు ఉన్నప్పుడు జాతీయ దేవుడు అవసరం లేదా. మన దేశానికీ ఓ దేవుడు కావాలి. అదీ వినాయకుడే అయి ఉండాలి’ ఇవి సాధారణమైన వ్యక్తి మాట్లాడిన మాటలు కావు. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు రమేశ్‌భాయ్ ఓజా వేల మంది భక్తుల సమక్షంలో చెప్పిన సూక్తులివి. భిన్న మతాలతో ఏకత్వం మెలిగే భారతదేశానికి ఒకే దేవుడు కావాలంటున్నాడు ఈ ఆధ్యాత్మిక గురువు రమేశ్ ఓజా. 

గుజరాత్‌లోని పోర్‌బందర్ ప్రాంతంలో సందీపణి విద్యా పీఠ్‌కు అధ్యక్ష్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఎమ్ఐటీ ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయం నిర్వహిస్తోన్న 9వ భారతీయ ఛత్ర సంసద్‌లో పాల్గొన్నారు. ఆదివారంతో ముగియనున్న ఈ కార్యక్రమంలో దేశానికి మేలు జరుగుతుందంటూ జాతీయ దేవుడిగా గణపతిని ప్రకటించాలని హిత బోధ చేశారు. వినాయకుడి ఆకారంలోనే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయని ఉద్భోద చేశారు. 

‘అసలు వినాయకుని అవతారంలో పరమార్థాన్ని చాలా మంది గుర్తించడం లేదు. విశాలంగా ఉన్న చెవులు నాయకునికి కావలసిన ప్రథమ లక్షణం. అందరి బాధలను వినేందుకు అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటన్నిటిని దేవుడి వినాలి కదా. కళ్లు చిన్నవిగా ఉంటే సూక్ష్మ పరిశీలన చేయగలడు. తొండం పొడుగ్గా ఉండటం వల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో భవిష్యత్‌ పరిణామాలను కూడా అంచనా వేయగలడు.

ఆకారంలో ప్రత్యేకంగా కనిపించేది ఉదరం. అది పెద్దగా ఉంటుంది అంటే అది రహస్యాలను దాచి ఉంచగల స్వభావం ఉన్నట్టే. ఇలా విఘ్నేశ్వరుడు జ్ఞానానికి చిహ్నం’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆయనకు వాహనంగా ఉన్న ఎలుక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఉదహరణగా భావిస్తూ.. జ్ఞానానికి చిహ్నమైన వినాయకుడు ఎలుక మీద ప్రయాణిస్తే.. సంపద (రిద్ధి-సిద్ధి)రూపంలో చేకూరుతుందని విశ్లేషించాడు.