Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం.. త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం
పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు

maha kumbh mela 2025
Maha Kumbh mela: పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఒక్కరోజు కోటి మందికిపైగా భక్తులు గంగా స్నానం చేస్తారని అంచనా. అయితే, ఉదయం 7.30గంటల వరకే 35లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్ రాజ్ అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45రోజుల పాటు మహా కుంభమేళా కొనసాగనుంది. ఈ ఏడాది కుంభమేళాకు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది.
Also Read: Bhogi Festival: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ.. భోగి మంటలతో మొదలైన సంక్రాంతి సంబరాలు
మహాకుంభ మేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు ఈ కుంభమేళాకు వస్తుంటారు. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించారు. యాత్రికులకు ఇబ్బంది తలెత్తకుండా 1.6లక్షల టెంట్లను, 1.5లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.. 45వేల మంది పోలీసులు కుంభమేళా బందోబస్తులో పాల్గొంటున్నారు. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది.
గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ మూడు నదులు ప్రయాగ్ రాజ్ లోని సంగం వద్ద కలుస్తాయి. దీంతో ఈ ప్రయాగ్ రాజ్ ఒక యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచింది.
మహా కుంభమేళాలో షాహి స్నాన్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని అమృత్ స్నాన్ అని కూడా పిలుస్తారు. షాహి స్నాన్ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ 3వేల ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు మొత్తం 13వేలకుపైగా ట్రిప్పులు వేయనున్నాయి. ప్రయాగ్ రాజ్ జంక్షన్ తో పాటు ఎనిమిది సబ్ స్టేషన్లు నిర్మించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి సుమారు 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
మహాకుంభ మేళాకు 15లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు వస్తారని కేంద్ర పర్యాటక శాఖ అంచనా వేస్తుంది. విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి సౌకర్యాలను కల్పిస్తూ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేలా మహా కుంభమేళాలోని పది ఎకరాల్లో ‘కళాగ్రామం’ నిర్మించారు.
మహా కుంభమేళా చివరి రోజు శివరాత్రితో ముగుస్తుంది. ఆ రోజు స్నానమాచరించేందుకు పెద్దెత్తున భక్తులు వస్తారు.
#MahaKumbhMela2025 | Uttar Pradesh: A large number of people arrive in Prayagraj to take a holy dip in Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/pXzeEr4SgF
— ANI (@ANI) January 13, 2025