మెడికల్ కాలేజీ స్కామ్…అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సీబీఐ కేసు నమోదు

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2019 / 02:00 PM IST
మెడికల్ కాలేజీ స్కామ్…అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సీబీఐ కేసు నమోదు

Updated On : December 6, 2019 / 2:00 PM IST

ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు.  ఈ స్కామ్ లో శుక్లాతో పాటుగా చత్తీస్ గఢ్ హైకోర్టు రిటైర్ట్ జడ్జి ఐఎమ్ ఖుద్దుషి,ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తో పాటుగా మరికొందరిపై కూడా సీబీఐ కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన తర్వాత ఢిల్లీ,మీరట్ లలో కూడా ఈ కేసుకి సంబంధించి సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు.

చత్తీస్ గఢ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఇష్రత్‌ మస్రూర్‌ ఖడూసీని, మరో ఐదుగురిని సెప్టెంబర్‌ 20 న సీబీఐ అరెస్ట్‌ చేయడంతో వ్యవహారం ఒక్కసారిగా పొక్కింది. లక్నోలో ఉన్న ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పిఐఎంఎస్‌) అనే కాలేజీలో వార్షిక తనిఖీలు జరిపిన మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) తాము గతంలో సూచించిన వాటినేవీ కాలేజీ యాజమాన్యం ఏర్పాటుచేయలేదని తేల్చింది. అవి ఏర్పాటు చేసే దాకా కొత్త అడ్మిషన్లు జరపరాదని ఆదేశిస్తూ రెండేళ్ళ పాటు అన్ని విభాగాల్లో- ఎంబిబిఎస్‌ ప్రవేశాలను, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అడ్మిషన్లను నిషేధించింది. ప్రసాద్‌ మెడికల్‌ కాలేజీతో పాటు మరో 46 కాలేజీల్లో కూడా ఇదే తీరున ప్రవేశాలను ఆపేసింది. ఎంసిఐ నిర్ణయాన్ని ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

అయితే ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్న వ్యక్తులు కుట్ర పన్నించి, కోర్టు అనుమతితో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 2017 ఆగస్టు-24న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచీ ముందు మరొక రిట్ పిటిషన్ వేశారు. ఆగస్టు-25,2017న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ శుక్లాతో కూడా డివిజన్ బెంచ్ అదే రోజున ప్రసాద్ మెడికల్ ట్రస్ట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పు అనుకూలంగా వచ్చేందుకు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల్లో ఒకరికి ట్రస్ట్ కొంతమేర డబ్బులు ముట్టజెప్పినట్లు అధికారులు తెలిపారు.