వేర్పాటువాద నేతలకు NIA సమన్లు : కేంద్రం కఠిన వైఖరి

  • Published By: chvmurthy ,Published On : March 9, 2019 / 04:18 PM IST
వేర్పాటువాద నేతలకు NIA సమన్లు : కేంద్రం కఠిన వైఖరి

Updated On : March 9, 2019 / 4:18 PM IST

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో  NIA  ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.  హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమారుడు నదీమ్ గిలానీకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సమన్లు పంపింది.  వీరు సోమవారం మార్చి 11న  ఎన్ఐఏ విచారణకు హాజరు కావాలని  అధికారులు తెలిపారు.  పుల్వామా ఉగ్రదాడి తర్వాత వేర్పాటువాద నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో  ఫిబ్రవరి26 న దాడులు జరిపి  కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది.  అనంతరం వారిని విచారణకు పిలవటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 

గత సోమవారం నాడు  ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మిర్జాయిజ్ ఉమర్ ఫరూఖ్‌తో సహా కాశ్మీర్‌లోని ఏడు ప్రాంతాల్లోని వేర్పాటువాదుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ఉగ్రవాద సంస్థల కు చెందిన లెటర్ హెడ్‌లు, హై-ఎండ్  ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లభ్యమయ్యాయి. ఆర్థిక లావాదేవీలకు చెందిన రసీదులు, బ్యాంకు అకౌంట్ల వివరాలు, పాక్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం వీసాల సిఫారస్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. లాప్‌టాప్‌లు, ఈ-టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, పెన్ డ్రైవ్స్, డివీఆర్‌లతో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ఈ గాలింపు చర్యల్లో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.