డేంజర్ బెల్స్ : ఢిల్లీలో ఉండలేం..40 శాతం మందిది ఇదేమాట

దేశ రాజధాని ఢిల్లీలో ఉండలేమంటున్నారు. అక్కడ ఉండాలంటే వణికపోతున్నారు. దీనికి కారణం వాయు కాలుష్యం. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని దాదాపు 17 వేల మందిపై ఓ సర్వే నిర్వహించింది. గాలి నాణ్యత క్షీణించడంతో..40 శాతానికి పైగా స్థానికులు తాము ఢిల్లీని వీడి వేరే నగరంలో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కాలుష్య తీవ్రత తగ్గే వరకు వేరే ప్రాంతాల్లో ఉండాలని అనుకుంటున్నట్లు కొంతమంది తెలిపారు. గాలి శుద్ధి యంత్రాలు, మాస్కుల వంటి రక్షణ మార్గలను ఆశ్రయిస్తూ..ఢిల్లీలోనే కొనసాగుతామని 31 శాతం మంది చెప్పారని తెలిపారు. కాలుష్యాన్ని తట్టుకుంటూ..ఢిల్లీలోనే ఉండడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని మిగిలిన 13 శాతం మంది పేర్కొన్నారు.
దేశరాజధాని ఢిల్లీలో ఊపిరాడక చాలా మంది ఇక్కట్లకు గురవుతున్నారు. శివారు ప్రాంతాలూ అల్లాడిపోతున్నాయి. గాలి నాణ్యత మూడేళ్లలో అత్యంత కనిష్టస్థాయికి పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ (AQI) రీడింగ్ 500 దాటితేనే పరిస్థితి అత్యంత ప్రతికూలంగా ఉన్నట్లు లెక్కగడుతారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం ఢిల్లీలోని జహంగీర్ పురి, రోహిణి, సోనియా విహార్ తదితర ప్రాంతాల్లో ఈ సూచీ 999ని తాకిందంటే..కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పరిసరాల్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గాజియాబాద్‌లో అన్ని పాఠశాలలకు నవంబర్ 05వ తేదీ వరకు సెలవలు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం, గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవలు ప్రకటించింది. గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకుందామంటూ..కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలకు సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Read More : తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్