సేమ్ టు సేమ్ : నాందేడ్ నుండి రాహుల్ పోటీ

ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమీ కాదు. పార్టీకి పట్టు వున్న ప్రాంతాల నుండే ఆయా నాయకులు ఆయా ప్రాంతాల నుండి పోటీలకు దిగుతుంటారు. దీనికి ఏ పార్టీగానీ..ఏ నాయకుడు గానీ అతీతం కాదు. 2014 ఎన్నికల్లో సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లోని వడోదరతో పాటు..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా ప్రధాని ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసిన విషయం తెలిసిందే. నరేంద్రమోదీ పోటీ చేసిన ప్రభావంతోనే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయానికి (యూపీలో బీజేపీ 70 స్థానాల్లో గెలుపు)దోహదం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వడోదర, వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ… ఈ సారి గుజరాత్‌తో పాటు ఒడిశాలోని పూరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
మోడీ వ్యూహాన్ని ఫాలో అవుతున్న రాహుల్
సేమ్ టు సేమ్ ఇదే వ్యూహాన్ని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమలు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే రాహుల్ గాంధీ… ఈ సారి అమేథీతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాందేడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఈ సారి బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీ తరువాత 48 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న మహారాష్ట్ర నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమేథీతో పాటు నాందేడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.