శబరిమల గొడవ: మలయాళ దర్శకుడిపై పేడతో దాడి

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియనందన్ పై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆవుపేడతో దాడి చేసి పిడిగుద్దులు గుద్ది గాయ పరిచారు. శుక్రవారం ఉదయం ఆయన ఇంటి నుండి పాలు తీసుకురావటానికి బయటకు రావటంతో , ఇంటి సమీపంలోని పాల షాపు వద్ద ఈఘటన జరిగింది. దాడిచేసిన వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా గుర్తించారు.
గతంలో ఆయన తన ఫేస్ బుక్ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం పై ప్రస్తావిస్తూ “వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే తప్పేంటని” ప్రశ్నించారు. దీనిపై అప్పట్లో ఆయన ఇంటి ముందు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
ఈ ఉదయం ఆయన ఇంటి నుండి బయటకు రాగానే కొందరు వ్యక్తులు వచ్చి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు గురించి ప్రస్తావిస్తూ, పిడి గుద్దులు గుద్దుతూ ఆవు పేడతో దాడి చేశారని ప్రియనందన్ తెలిపారు. ఈ దాడిలో ఆయన చెవికి గాయం కావటంతో స్ధానికులు ఆస్పత్రికి తీసుకు వెళ్ళి చికిత్స చేయించారు. అనంతరం ఆయన త్రిశూర్ పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.
డైరెక్టర్ నందన్ పై దాడిని సీఎం పినరయ్ విజయన్ ఖండించారు. దోషులను పట్టుకుని శిక్షించాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి దాడులు జరిపితేసంహించేది లేదని సీఎం అన్నారు. కాగా .. దాడితో తమ కెలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కే.బీ.గోపాలకృష్ణన్ తెలిపారు. ప్రియనందన్ పై దాడిని కేరళ చిత్ర పరిశ్రమ ఖండించింది. 2006 లో ఆయన దర్శకత్వం వహించిన పులిజన్మం సినిమా 54వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సులో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.