నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ : శివసేన సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకటించారు. ఉద్థవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటంతో తమ మిషన్ పూర్తయిందని ఇక ఢిల్లీలోనూ పాగా వేస్తామని అన్నారు.
రాష్ట్రంలో శివసేన నాయకుడే సీఎం అవుతారని చెప్పినప్పడు అంతా నవ్వారని ఇప్పడు మంత్రాలయంలోని ఆరో అంతస్తు శివసేన సూరీడుతో కాంతులీనుతోందని అన్నారు. భవిష్యత్తులో ఢిల్లీలోనూ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్య పోనవసరంలేదని అయన అన్నారు. తమ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని ఎన్సీపీ,కాంగ్రెస్ శివసేన ఎమ్మెల్యేల ఉమ్మడి సమావేశంలో శివసేన చీఫ్ ఉద్థవ్ థాకరే అన్న రెండు రోజులకే రావత్ ఈ వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
తాజా పరిణామాల్లో శివసేనకు అధికార పీఠం దక్కడంలో సంజయ్ రౌత్ కీలకంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. తాను చాణక్యుణ్ని కాదని… శివసేన సైనికుడిని మాత్రమే నని.. నాకు ఇలాంటి బాధ్యతలు బాల్ థాకరే కూడా అప్పగించారని ఆయన చెప్పారు. బాల్ థాకరే పనిచెప్పినప్పుడు నేనెప్పుడు కాదనలేదని.. ఉద్ధవ్ థాకరే కు కూడా నిన్న..ఇక నా బాధ్యత తీరిపోయింది అని చెప్పానన్నారు. గవర్నర్ పిలుపు మేరకు మహారాష్ట్ర అసెంబ్లీనేడు ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ప్రోటెం స్పీకర్ కాళిదాస్ కోలంబకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్న శివసేన అధినేత ఉధ్థవ్ థాకరే బుధవారం ఉదయం గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా ఉధ్థవ్ థాకరే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనున్నారు.