ముంబైలో భారీ వర్షాలు…BSE సైన్‌బోర్డ్ ధ్వంసం

  • Published By: venkaiahnaidu ,Published On : August 5, 2020 / 09:56 PM IST
ముంబైలో భారీ వర్షాలు…BSE సైన్‌బోర్డ్ ధ్వంసం

Updated On : August 6, 2020 / 9:20 AM IST

భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం వర్షంతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రచండ గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కుప్పకూలాయి. అంతేకాకుండా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు ధ్వంసమైంది. గాలులు ధాటికి ఒరిగిపోయి గాల్లో వేలాడుతోంది.



ఆ సైన్ బోర్డు కింద పడితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని.. అది కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీఎస్ఈ అధికారులు తెలిపారు. మరోవైపు,నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం కూడా ధ్వంసమైంది. భారీ వర్షం, గాలుల ధాటికి స్టేడియం పైకప్పులో కొంతభాగం కిందపడిపోయింది.

భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ను రంగంలోకి దింగి సహాయక చర్యలను చేపట్టింది. రోడ్లపై కూలిపోయిన చెట్లు, హోర్డింగ్‌లను తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పలు బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని అధికారులు తెలిపారు. రాగల గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు సూచించారు.