దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 01:17 AM IST
దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

Updated On : April 23, 2019 / 1:17 AM IST

దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బిహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్ అనంత్ నాగ్ లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతోంది.

ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకం. 2014 ఎన్నికల్లో ఈ 116 స్థానాల్లో 66 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం 27 సీట్లకే పరిమితమయ్యాయి. దీంతో అదే ఫలితాలను పునరావృతం  చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో 2.10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

బీజేపీ చీఫ్ అమిత్‌ షా పోటీ చేస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌, కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని  మెయిన్‌పురి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ ‌పవార్‌ కూతురు సుప్రియాసూలే పోటీ చేస్తున్న మహారాష్ట్రలో బారామతి, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే పోటీలో ఉన్న కర్ణాటకలోని కలబురిగి స్థానాలకు మూడో దశలోనే  ఎన్నికలు జరుగుతున్నాయి.