పిల్లలకు ఇప్పుడు ఇలా చెప్పకూడదు : కూ.. చుక్ చుక్ రైలు కాదు

కూ. చుక్.. చుక్.. అనగానే టక్కున గుర్తుచ్చేది రైలు.. చిన్న పిల్లలు సరదగా ఇంట్లో రైలు కూతతో ఆటలు ఆడుకోవడం చూసే ఉంటాం. రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లగానే అదిగో మమ్మి.. డాడీ రైలు వస్తుంది.. చుక్.. చుక్ అని అంటుంటారు. చుక్.. చుక్ శబ్దం వినగానే వెంటనే రైలు వచ్చేసిందని చెబుతుంటారు. ఇకపై ఆ రైలు కూత మూగబోనుంది. పక్క నుంచి వెళ్లిన కూడా రైలు శబ్దం వినిపించదు. వచ్చే డిసెంబర్ నాటికి రైళ్లన్ని నిశబ్దంగా ప్రయాణించనున్నాయి.
అధిక ధ్వనిని ఉత్పత్తి చేసే పవర్ కార్స్ బదులుగా ఎలక్ట్రానిక్ సప్లయ్ సిస్టమ్ తో రైలు ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు (ఎడ్ ఎండ్-పవర్) వెనుక భాగంలో అమర్చిన రెండు పవర్ కార్లలో ఒకదాని స్థానంలో LSLRD (LHD సెకండ్ లగేజీ గార్డ్, దివ్యాంగుల కంపార్ట్ మెంట్)ను అమర్చనున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకించి ఆరు సీట్లతో ఈ కంపార్ట్ మెంట్ డిజైన్ చేశారు. అంతేకాదు.. అదనంగా చైర్ కార్ లో 31 సీట్లు, అదనపు లగేజీ స్థలం కూడా ఉంటుందని తెలిపారు.
ఒక పవర్ కారుకు మాత్రం సైలంట్ జనరేటర్ కార్ ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం రైళ్లలో వాడే పవర్ కార్స్ 105 డెసిబుల్స్ శబ్దాన్ని జనరేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరిలో ఆ కూత మూగబోనుందని రైల్వే బోర్డు (రోలింగ్ స్టాక్) మెంబర్ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. సైలంట్ పవర్ కార్ వినియోగించడం ద్వారా ఒక ఏడాదిలో రూ.800 కోట్ల పవర్ బిల్లులను ఆదా చేసుకోవచ్చునని చెప్పారు. పవర్ కార్ నుంచి విడుదలయ్యే గాలిని తగ్గించడమే కాకుండా ధ్వని కాలుష్యాన్ని కూడా నివారించవచ్చునని అగర్వాల్ అన్నారు.
పవర్ కార్ వ్యవస్థను హెడ్-ఆన్ జనరేషన్ (HOG)గా పిలుస్తారు. ప్రస్తుతం ఒక యూనిట్ పవర్ కు రూ.36వరకు ఖర్చు అవుతుంది. ఇకపై HOGతో ఒక యూనిట్ కు రూ.6కే అందుబాటులో ఉండనుంది. రైల్వే విద్యుత్ సరఫరా కోసం ఇరువైపులా రెండు పవర్ కార్లను ఉపయోగించే లింకే హాఫ్మన్ బోస్చే కోచ్లను HOG వ్యవస్థగా మార్చే పనిలో ఉంది. ఇప్పటి వరకు, 342 రైళ్లను HOGగా మార్చగా, ఏడాది ఆఖరులో 284కు పైగా రైళ్లను HOG వ్యవస్థగా మార్చడం వల్ల ఎక్కువ ఆదా అవుతుందని భావిస్తున్నట్టు అగర్వాల్ తెలిపారు.