ఉన్నది చదువు : గవర్నర్ మందలింపుతో…2సార్లు మంత్రిగా ప్రమాణం

  • Published By: venkaiahnaidu ,Published On : December 30, 2019 / 02:22 PM IST
ఉన్నది చదువు : గవర్నర్ మందలింపుతో…2సార్లు మంత్రిగా ప్రమాణం

Updated On : December 30, 2019 / 2:22 PM IST

మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.36 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు. మొత్తం 36 మంత్రుల్లో 26 మంది మంత్రులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా, మిగతా 10 మంది మంత్రులు జూనియర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

అయితే ఈ సందర్భంగా ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ కాంగ్రెస్ నాయకుడుపై గవర్నర్ సీరియస్ అయ్యారు. దీంతో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. అయితే రెండుసార్లు అతను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కారణం ఏంటబ్బా,గవర్నర్ ఆయనపై ఎందుకు సీరియస్ అయ్యారని అనుకుంటున్నారా?

విధాన్ భవన్ లో సోమవారం మధ్యాహ్నాం మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ పాడ్వి మంత్రిగా ప్రమాణం చేసేందుకు స్టేజీపైకి వచ్చారు. ప్రమాణస్వీకార సమయంలో పాడ్వి ప్రొటోకాల్ ను ఉల్లంఘించారు. ఫార్మాట్ లో లేని విధంగా కొన్ని అదనపు పదాలను ఆయన ప్రమాణస్వీకార సమయంలో పలికారు. 61ఏళ్ల పాడ్వి ప్రమాణస్వీకార సమయంలో తన నియోజకవర్గానికి,ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. అయితే వెంటనే పాడ్విని గవర్నర్ మందలించారు. ప్రమాణస్వీకార సమయంలో ముందువరుసలో కూర్చున్న సీనియర్ నాయకులు పవర్ టాంప్లేట్ కు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని బహుశా మీకు చెప్పి ఉంటారు అని గవర్నర్ పాడ్వితో అన్నారు. ఆ తర్వాత సీనియర్ నాయకులు ఇందులో జోక్యం చేసుకోవాలని గవర్నర్ కోరారు. దీంతో ప్రొటోకాల్ ఫాలో అవ్వాలని చుట్టుూ ఉన్న సీనియర్ నాయకులు చెప్పడంతో పాడ్వి మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పాడ్వి.

తన కేబినెట్ లో ఉద్ధవ్ ముగ్గురు స్వతంత్రులకు కూడా చోటు కల్పించారు. వారిలో రైతు నేత, నాలుగు సార్లు విదర్భ నుంచి స్వతంత్ర శాసనసభ్యుడిగా ఎన్నికైన బచ్చు ఖడు, అహ్మద్ నగర్ నుంచి శంకర్ గడ్డఖ్, కోల్హాపూర్ నుంచి రాజేంద్ర యద్రావకార్ ఉన్నారు. ఈ స్వతంత్రలంతా కలిసి శివసేనకు మద్దతు పలికినవారిలో ఉన్నారు. మరో ఆశక్తికర పరిణామం ఏంటంటే…ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కి కూడా కేబినెట్ లో చోటు దక్కడం. దీంతో ఒక నెల వ్యవధిలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ రెండు సార్లు ప్రమాణం చేసిన ఘనత ఈయనకే దక్కింది.

ఎన్సీపీ చీప్ శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ గత నెలలో రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి ఉదయానికల్లా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దేశరాజకీయాలను ఈ ఘటన కుదిపేసింది. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు అని అజిత్ ఉదంతం అందరికి అర్థమయ్యేలా చేసింది. అయితే ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అజిత్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాము బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లోనే మద్దతివ్వబోమని తేల్చిచెప్పిన అనంతరం చేసేదేమీ లేక అజిత్ తన డిప్యూటీ సీఎం పదవికి కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు.అజిత్ రాజీనామా చేసిన కొద్దిసేపటికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మహావికాస్ అఘాడి పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అజిత్ బీజేపీకి బైబై చెప్పి తిరిగి సొంతగూటికి చేరుకున్న విషయం తెలిసిందే.