టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వరుసలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఉన్నారు. ఎంపీ పండుల రవీంద్రబాబు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అమలాపురం నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఐఆర్ఎస్ అధికారి ఢిల్లీలో తన పదవి వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి పోటీ చేసి నేరుగా ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఐదేళ్లుగా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కారు.
అమలాపురం పార్లమెంట్ సీటు నుంచి 2019 ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగాలని పండుల ఆశిస్తున్నారు. ఇటీవల కోనసీమ రైల్వే లైన్ కోసం ఆయన చేసిన కృషి ఫలిస్తుందని ఆశిస్తున్నారు. కానీ ఎక్కువగా అందుబాటులో ఉండడం లేదని ప్రజల్లో ఆయన పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు టీడీపీలోనే పలువురు నేతలతో ఆయనకు సఖ్యత లేదు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులతో రవీంద్రబాబుకి విబేధాలున్నాయి. దాంతో ఎన్నికల్లో అమలాపురం టికెట్ కోసం కొత్త నేతను తెరమీదకు తీసుకొచ్చేందుకు పండుల వ్యతిరేకులు చేస్తున్న ప్రచారాలతో ఆయన కలత చెందినట్టు కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడిని పోటీకి దింపాలని టీడీపీలోని కొందరు ప్రయత్నిస్తున్నారు. దాంతో తన సీటు మీద సందేహాలు ఉన్న పండుల.. టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో రాజోలు లేదా పి.గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఆయన ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. అలా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే ఆలోచనకు పండుల రవీంద్రబాబు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన కోఆర్డినేటర్ లేకపోవటంతో ప్రత్యామ్నాయ నేతల కోసం వైసీపీ చూస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ అధిష్టాన వర్గం పండులకు అసెంబ్లీ సీటుపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పండుల జగన్‌తో భేటీ అయిన తర్వాత అమలాపురం రాజకీయాల్లో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
పండుల రవీంద్రబాబు జగన్‌తో భేటీ కావడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం(ఫిబ్రవరి-18-2019) సాయంత్రం జగన్‌తో భేటీ అయిన తర్వాత పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుంటారు. దాంతో అమలాపురం పార్లమెంట్ సీటు పరిధిలో రాజకీయాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది. నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు అనివార్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీ టీడీపీలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇంకా ఎంతమంది టీడీపీ వీడతారో అనేది హాట్ టాపిక్‌గా మారింది.