టీడీపీ, వైసీపీలో కలవరం : IASల కీలక సమావేశం

అమరావతి : కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఉంది ఏపీలో ఐఏఎస్ ల పరిస్థితి. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీ సీఈవోకి అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ లను టార్గెట్ పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు ఏకంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు కొందరు ఐఏఎస్ లపై వేటు వేసేందకు సిద్దంగా ఉన్నారు. ఎవరు సీఎం అయినా వారి టార్గెట్ మాత్రం ఐఏఎస్ లే కానున్నారు. దీన్ని ఐఏఎస్ లు సీరియస్ గా తీసుకున్నారు. తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 23,2019) సాయంత్రం 6గంటలకు ఐఏఎస్ అధికారులు సమావేశం కానున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశంలో తాము పడుతున్న ఇబ్బందులు, పరిష్కారాలపై చర్చించనున్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ దగ్గర ఉన్న టూరిజం హోటల్ లో ఈ భేటీ జరగనుంది.
అహ్మద్ బాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. తమకు సంబంధంలేని వ్యవహారంలా ప్రవర్తించారు. దీంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఐఏఎస్ ల ద్వారా కౌంటర్ ఇప్పించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఏఎస్ అధికారుల సంఘంలో ఉన్నవారిలో కొంతమంది చంద్రబాబుకి, మరికొంతమంది జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఐఏఎస్ ల సమావేశంపై టీడీపీ, వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు పార్టీల నాయకులు ఈ భేటీపై ఫోకస్ చేశారు. ఈ సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఆసక్తిగా చూస్తున్నారు.
అదే సమయంలో తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడే వారి జాబితాను టీడీపీ, వైసీపీ నాయకులు సిద్ధం చేసుకుని భవిష్యత్ లో ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ భయంతో సమావేశంలో మనసు విప్పి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఐఏఎస్ ల కీలక భేటీ ఎలా జరగనుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.