Chandrababu Naidu : మీరు చంపి.. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మాపై ఆరోపణలా?-చంద్రబాబు
Chandrababu Naidu: ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు.

Chandrababu Naidu : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ప్రపంచంలో ఉన్న పోలీసులందరికీ ఒక కేసు స్టడీ లాంటిదన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదన్నారు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీ వారు మా చిన్నాన్న చంపి వేశారని ఆనాడు ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
అధికారులను మార్చి కేసును తారుమారు చేశారుని, దోషులను కాపాడటానికి వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మీరు చంపి వేరే వారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు చంద్రబాబు.
” తెల్లారితే గుండెపోటు అన్నారు. ఆపై రక్తపు వాంతులతో చనిపోయారన్నారు. బాక్స్ లో పెట్టి కుట్లు వేసి దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. కుటిల రాజకీయాలను వైసీపీ పులివెందుల నుంచే ప్రారంభించింది. హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ కావాలన్నారు. ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసులు పెట్టి ఆయనను కూడా బెదిరింపులకు గురి చేశారు.
ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. హత్యా రాజకీయాలు పోవాలి. హత్య చేసి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండుంటే ఈ రోజుకి కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసే వాళ్ళం” అని చంద్రబాబు అన్నారు.