అప్పటివరకు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను వదిలేదే లేదు- జగ్గారెడ్డి వార్నింగ్

ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు రమ్మంటే ఎట్లా వస్తాం?

అప్పటివరకు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను వదిలేదే లేదు- జగ్గారెడ్డి వార్నింగ్

Jagga Reddy Slams KCR

Jagga Reddy : తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

మేడిగడ్డనా? బొందల గడ్డనా? మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్తున్నారు? అని కేసీఆర్ అనడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ అలాంటి మాటలు మాట్లాడటం సరైనదా? అని జగ్గారెడ్డి నిలదీశారు. మేడిగడ్డకు వెళ్లి ఏం చేస్తారు? అని నల్లొండ సభలో కేసీఆర్ అన్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మరిప్పుడు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ అవినీతిని బయటపెట్టేందుకే మేము మేడిగడ్డకు వెళ్ళామన్నారాయన. మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పేంత వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను వదిలేదే లేదన్నారు. ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు రమ్మంటే ఎట్లా వస్తాం? అని బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగారు జగ్గారెడ్డి.

Also Read : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

మరోవైపు బీజేపీ నేతలపైనా జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ”దునియాలో ప్రజలు ఎవరూ దేవుడిని మొక్కడం లేదు. మేమే మొక్కుతున్నం అన్నట్లుగా ఉంది బండి సంజయ్ వ్యవహారం. శ్రీరాముడు బీజేపీలో కొంతమందికే దేవుడా? శ్రీరాముడు తల్లిని గౌరవించే మహానుభావుడు. తల్లి మాటలు కాదనకుండా వనవాసం పోయిన గొప్ప వ్యక్తి. బండి సంజయ్ లో రాముడి విలువలు ఏ మాత్రం లేవు. పొన్నo ప్రభాకర్ తల్లిని కామెంట్ చేసి బండి సంజయ్ శ్రీ రాముడికున్న విలువను తగ్గించారు. రాముడికున్న గొప్ప చరిత్రను దిగజారుస్తున్నారు. బండి సంజయ్ బేషరతుగా పొన్నం ప్రభాకర్ కు క్షమాపణలు చెప్పాలి” అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.