Telangana Congress: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్‌‌ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..

తెలంగాణలో 131 మున్సిపాలిటీలు, 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కనీసం 90 శాతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

Telangana Congress: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్‌‌ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..

Gandhi Bhavan Representative Image (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 9:28 PM IST
  • కొత్త, పాత నేతల పంచాయతీతో కాంగ్రెస్‌ పెద్దలకు హెడెక్‌
  • ఆ ఐదు మున్సిపాలిటీలపై హస్తం పార్టీ పెద్దల స్పెషల్ ఫోకస్
  • ఓ సీనియర్ నేతను రంగంలోకి దింపే ఆలోచనలో సీఎం రేవంత్

 

Telangana Congress: అటో ఇటో పంచాయతీ పోరు నుంచి గట్టెక్కారు. ఇక పుర పోరు రాబోతోంది. వార్‌ వన్‌ సైడే అంటూ పైకి చెప్తున్నా..కొన్ని మున్సిపాలిటీల్లో ఉన్న పొలిటికల్ సీన్ కాస్త హస్తం పార్టీని కలవరపెడుతోందట. ఐదు నియోజవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ అంతర్గత పోరు..అధికార పార్టీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోందట. ఆ మున్సిపాలిటీల్లో వర్గపోరుకు చెక్ పెట్టేదెలా? సీఎం రేవంత్ దగ్గరున్న చిట్కా ఏంటి? ఆ పెద్ద నేతను రంగంలోకి దింపితే ఆల్‌ సెట్టా?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ పోరుకు కసరత్తు స్పీడప్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ కూడా జిల్లాల టూర్‌కు రూట్ మ్యాప్ రెడీ చేసి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇక పురపాలక ఎన్నికలు జరిగేది పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడం..ప్రాంతాల్లో తమకే పట్టు ఉందని పుర పోరులో కాషాయ జెండా ఎగరవేస్తామంటోంది బీజేపీ.

కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న 5 నియోజకవర్గాలు..

తెలంగాణలో 131 మున్సిపాలిటీలు, 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కనీసం 90 శాతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సవాల్‌గా మారాయట. ముఖ్యంగా ఐదు నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి ముదురుతోందట. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక హస్తం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.

పాత కొత్త నేతల మధ్య వివాదం..

అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ రూపంలో అంతో ఇంతో ఇబ్బంది కలిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా సేమ్‌ సీన్ రిపీట్‌ అయితే పెద్ద బొక్క బోర్లా పడటం ఖాయమని భావిస్తున్నారట. జగిత్యాల, గద్వాల్‌, బాన్సువాడ, చేవెళ్ల, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదం తీవ్రంగా ఉందట. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్టు ఇచ్చేది తానేనని, వేరే వాళ్లు ఇన్వాల్వ్ అయితే కథ వేరే ఉంటుందంటూ జీవన్‌రెడ్డి వార్నింగ్‌లు ఇస్తున్నారు.

ఇక గద్వాల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సరిత తిరుపతయ్యకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య కోల్డ్‌ వార్ నడుస్తూనే ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌ కొత్తగా మున్సిపాలిటీ అయింది. అక్కడ కూడా కడియం శ్రీహరి, ఇందిరా మధ్య వివాదం నడుస్తోంది. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్, కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బాన్సువాడలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్‌లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య నిత్యం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి.. పురపోరులో రెబల్స్ బాధ తప్పేలా లేదు. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయి తమ మద్దతుదారులను టికెట్‌ ఇప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. ఒకవేళ తమ వర్గానికి టికెట్ రాకపోతే రెబల్‌గా పోటీ చేసి తీరుతామని రెండు వర్గాల నేతలు ఓపెన్ ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ వర్గపోరుకు ఎలా చెక్ పెట్టాలి..సయోధ్య కుదిర్చేది ఎలా అని కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారట.

ఐదు నియోజకవర్గాల్లో రెండు వర్గాల నేతలు కలిసి పనిచేస్తేనే అనుకున్న రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ను ఐదు నియోజకవర్గాలకు పంపాలని పార్టీ నిర్ణయించిందట. గొడవలకు చెక్ పెట్టి, రెబల్స్ నుంచి పోటీ లేకుండా నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయబోతున్నారట మీనాక్షి నటరాజన్. ఇక పార్టీ నుంచి ఒక కమిటి వేసి, సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. స్థానికంగా పట్టు కోసం ఫైటింగ్‌కు దిగుతున్న నేతలు మీనాక్షి మాట వింటారా? లేక యాజ్‌టీజ్‌గా వర్గపోరుకు దిగుతారా అనేది చూడాలి.

Also Read: ఆందోళన వద్దు.. అందరికీ టికెట్‌..! కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?