ఏపీలో పల్నాడు టెన్షన్

  • Published By: chvmurthy ,Published On : September 11, 2019 / 03:02 AM IST
ఏపీలో పల్నాడు టెన్షన్

Updated On : September 11, 2019 / 3:02 AM IST

గుంటూరు జిల్లాలో  టీడీపీ  ఇచ్చిన ఛలో ఆత్మకూరు పిలుపు ఏపీలో టెన్షన్ పుట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో పరిస్థితులు క్షణ క్షణం  ఉద్రిక్తంగా మారుతున్నాయి. గంట గంటకు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. చలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరాలని టీడీపీ  కృతనిశ్చయంతో ఉంటే.. దాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా  ప్రయత్నిస్తోంది. మరోవైపు పోలీసులు టీడీపీ చలో ఆత్మకూరును భగ్నం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

టీడీపీ వైసీపీ పోటా పోటీగా ఇచ్చిన చలో ఆత్మకూరుతో  జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.  దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు.

చంద్రబాబుసహా… టీడీపీ ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తగా  హౌస్ అరెస్ట్‌ చేసారు.  పోలీసుల కన్నుగప్పి పల్నాడు బయలుదేరిన నేతలను  దారిలోనే అరెస్టు చేసి సమీపంలోని పోలీసు స్టేషన్ల కు తీసుకు వెళుతున్నారు. టీడీపీ చేపట్టిన చలో పల్నాడు ను భగ్నంచేసేందుకు డీజీపీ గౌతం సవాంగ్‌ జిల్లా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో  మంగళవారం రాత్రి నుంచే  శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా రంగంలోకి దిగారు.

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేసారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద  పోలీస్‌ చర్యను ముందే పసిగట్టిన టీడీపీ అధిష్టానం ముఖ్యనేతలందరినీ రాత్రికి రాత్రే  వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి తరలిరావాలని ఆదేశించింది. పోలీసులను ప్రతిఘటించి  బాధితులతో కలిసి ఆత్మకూరుకు వెళ్లి తీరాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు టీడీపీ నేతలందరినీ శిబిరం దగ్గరే హౌస్‌ అరెస్ట్‌ చేయాలని పోలీసులు  భావిస్తున్నారు. శిబిరం చుట్టూరా పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. టీడీపీ పునరావాస శిబిరం చుట్టూ పోలీసులు ఇనుపకంచెతోపాటు పెద్ద సంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.