ప్రభుత్వానికి పవన్ డెడ్‌లైన్: వైసీపీకి రెండు వారాలే గడువు

ప్రభుత్వానికి పవన్ డెడ్‌లైన్:  వైసీపీకి రెండు వారాలే గడువు

Updated On : November 3, 2019 / 1:37 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించి తేడాలొస్తే తాటతీసి కింద కూర్చోబెడతామన్నారు. 

ఎన్నికలు ముగిసి ఆరు నెలలు పూర్తి కావడం లేదు. ఈ లాంగ్ మార్చ్ కు ఇంతటి ప్రజాదరణ వచ్చింది. ప్రజలు రోడ్లమీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలమైనట్లే. చంద్రబాబు గారి మీద కోపంతో లక్షల మంది ప్రజలను శిక్షిస్తానంటే ఎట్లా.. ఎవరి ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే నిర్మాణంతో మొదలుపెడతారు. 

కానీ, కూల్చివేతలతో మొదలుపెట్టారు. కూల్చుకుంటూ మొదలుపెట్టిన ప్రభుత్వం అలాగే కూలిపోతుంది. ఇదేదో కర్మ సిద్ధాంతం కాదు. న్యూటన్ మూడో నియమం చెబుతున్నాను చర్యకు ప్రతిచర్య ఉంటుంది చూస్తూ ఉండండని హెచ్చరించాడు. 

ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే సామాన్యుల నుంచి నాయకుడు పుడతాడు. వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకు ఆనందమా? ప్రజల కోసం భరిస్తున్నా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయవచ్చు కానీ చేయలేదు. నాకు పదవులు మీద ఆశ లేదు అన్నారు పవన్ కళ్యాణ్.