రోడ్డున పడ్డ సోషల్ మీడియా సిబ్బంది

రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో.. మీ అవసరం లేదంటూ పార్టీలన్నీ వారిని పక్కన పెట్టేశాయి. ఇంతకీ వారెవరూ? ఎందుకు పక్కనబెట్టారు?
రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రచారంతో పాటు గెలుపుకు సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యం. అందుకే ఆయా పార్టీలు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. పార్టీ అధినేత దగ్గర్నుంచి, కార్యకర్తలు చేస్తున్న ప్రతి పనిని ఈ సోషల్ మీడియా టీం ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి చేరవేశాయి. ప్రస్తుతం టీవీల్లో కంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల దగ్గర్నుంచి చోటామోటా పార్టీలు కూడా తమకు తోచిన సిబ్బందితో పార్టీ కార్యాలయాలలో సోషల్ మీడియా వింగ్‌ను నడిపించాయి. అందులో టీడీపీ, కాంగ్రెస్, వైసిపి, వైసిపి, జనసేన వంటి ప్రధాన పార్టీలు సోషల్ మీడియా పైనే ఫోకస్ పెట్టాయి.
సోషల్ మీడియా ప్రచారం, అధికారిక సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఒక్కో పార్టీ సోషల్ మీడియా టీంలను మేనేజ్ చేసేందుకు, లక్షల్లో జీతాలు ఇచ్చి మరీ నియమించుకున్నాయి. అయితే ఏప్రిల్ 11తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వివిధ పార్టీలు…సోషల్ మీడియా టీంలోని వందల మందిని తొలగించాయి. దీంతో చాలామంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురైంది.
అయితే అగ్రిమెంట్ ఆధారంగానే రిక్రూమెంట్ చేసుకున్నామని దాని ప్రకారమే తీసేశామని ఆయా పార్టీలు చెబుతున్నాయి. మరోవైపు ఉన్న పళంగా తమను ఉద్యోగాల నుంచి తీయడంపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వర్కర్స్ మండిపడుతున్నారు. ఇతర ఉద్యోగాలు చూసుకునే వరకైనా కొనసాగించి తర్వాత తొలగించినా ఇబ్బంది ఎదురయ్యేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.