తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? రెండు స్థానాలకు 15 మంది పోటీ

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 05:58 AM IST
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? రెండు స్థానాలకు 15 మంది పోటీ

Updated On : February 29, 2020 / 5:58 AM IST

రాజ్యసభ ఎన్నికలు టీఆర్ఎస్‌లో ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో పేరు తెరపైకి రావడంతో అటు రాజ్యసభ సీటును ఆశిస్తోన్నవారితో పాటు వారి అనుచరుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు స్థానాలే ఖాళీగా ఉన్నా.. దాదాపు 15 మంది పోటీపడుతున్నారు. ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఏప్రిల్ నెలలో ముగియనున్న కేకే, గరికపాటి పదవీ కాలం  
రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం ఏపీ కోటాలో ఉన్న కేకే తో పాటు…. గరికపాటి మోహన్ రావ్ పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ రెండు స్థానాలు అధికార పార్టీలో హాట్ కేకులుగా మారాయి. గతంలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయినపుడు పార్టీలో మొదటినుంచి ఉన్నవారితో పాటు.. ఉద్యమంలో ఉన్నవారి పేర్లు వినిపించేవి. కానీ ఈసారి కాస్త భిన్నంగా కొందరు పారిశ్రామిక వేత్తల పేర్లు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త పార్థసారథిరెడ్డి.. మెదక్‌ జిల్లాకు చెందిన రియల్టర్ ప్రవీణ్‌ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

తెరపైకి దామోదర్ రావు పేరు  
పార్లమెంట్‌లో పార్టీ గళం వినిపించేందుకు మాజీ ఎంపీ లు కల్వకుంట్ల కవిత, బోయినిపల్లి వినోద్‌లలో ఒకరిని కచ్చితంగా రాజ్యసభకు పంపే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న దామోదర్ రావు పేరు తాజాగా తెరపైకి వస్తోంది. గతంలోనే దామోదర్ రావును పెద్దలసభకు పంపాలని కేసీఆర్ భావించినా సామాజికవర్గాల సమీకరణ.. ఇంకా కొన్ని కారణాలతో దామోదర్‌రావుకు అవకాశం కల్పించలేదు. ఈసారి దామోదర్‌రావుకు చాన్స్‌ దక్కొచ్చని గులాబీనేతలు చెబుతున్నారు. 

కేకేకు మరోసారి అవకాశం కల్పించడంపై అనుమానాలు 
అటు కేకేకు మరోసారి అవకాశం కల్పించడంపై అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ.. తాజాగా సీనియర్ నేతగా ఆయనకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తునట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పేరు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు.. పార్టీ అవసరాలను పరిగణలోకి తీసుకుని రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఒక స్థానం అగ్రవర్ణాలకు కేటాయిస్తే .. మరొక స్థానం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఖాళీగా ఉన్న రెండు సీట్లకు చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి చివరకు కేసీఆర్ ఆశీస్సులు దక్కించుకునేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

See Also | గంగమ్మ చెంతకే తరలివచ్చిన భారీ హనుమంతుడు : ప్రయాగ్‌రాజ్‌లో గంగాభిషేకం