కేపిటల్‌ ఫైట్‌ : అమరావతిలో టీడీపీ నేతల పర్యటన

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 02:26 AM IST
కేపిటల్‌ ఫైట్‌ : అమరావతిలో టీడీపీ నేతల పర్యటన

Updated On : November 6, 2019 / 2:26 AM IST

ఏపీ రాజకీయాల్లో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే… రాజధానిపై జగన్‌ సర్కార్‌ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పర్యటించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో ఎంతమేర అభివృద్ధి చేశామో… ఎక్కడెక్కడ భవనాలు నిర్మించామో చూపిస్తామంటున్నారు.

జగన్‌ ప్రభుత్వం అమరావతిపై నిపుణుల కమిటీ వేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. నిపుణల కమిటీ ఏం చేస్తుందని నిలదీశారు. రాజధాని ఎంపిక, భూసమీకరణలో ఏ తప్పూ జరగలేదన్నారు చంద్రబాబు. అమరావతిపై చంద్రబాబు మాట్లాడొద్దన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ రాజధాని.. అమరావతేనని చంద్రబాబు కేంద్రానికి చెప్పారా అని ప్రశ్నించారు.

మరోవైపు అమరావతి విషయంలో సీఎం జగన్‌పై జనసేనాని విమర్శలు కురిపించారు. సీఎం జగన్ రాజధాని పులివెందులకు మార్చుకుంటే మంచిదేమో అని పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్నూలులో కోర్టు పెడితే… పులివెందుల నుంచి వెళ్లి రావడానికి సులువుగా ఉంటుందని సెటైర్లు వేశారు. మొత్తానికి రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు దాటిపోయినా… ఏపీ పాలిటిక్స్‌లో రాజధాని మంటలు మాత్రం కొనసాగుతున్నాయి.
Read More : కొండచిలువను చంపితే జైలుకే