జగన్‌కు అటువంటి ఆలోచనే లేదు: బుద్దా వెంకన్న

  • Published By: vamsi ,Published On : May 5, 2019 / 07:54 AM IST
జగన్‌కు అటువంటి ఆలోచనే లేదు: బుద్దా వెంకన్న

Updated On : May 5, 2019 / 7:54 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేనేలేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, జగన్ ఎన్నికలు అయిపోగానే విహార యాత్రలకు వెళ్లారని, తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు పడుతుంటే జగన్‌కు కనిపించట్లేదని, ఎన్నికలు అయిపోగానే ప్రజల సమస్యలు జగన్‌కు గుర్తుకు రావట్లేదని విమర్శించారు.

వైసీపీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు ఎందుకేశామా? అని బాధ పడుతున్నారని అన్నారు. సాంకేతికతను వాడి చంద్రబాబు తుఫాను నష్టాన్ని తగ్గించగలిగారని, 70ఏళ్ల‌ వయసులో ప్రజల కోసం పని చేయాలనే ఆరాటం‌ చంద్రబాబులో ఉందని కొనియాడారు.

పోలవరం పూర్తి చేసి ఏపీని సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని, బాబు పాలనను రాముడు పాలనతో ప్రజలు పోల్చుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో తాగునీరు, కరెంటు కష్టాలు లేకుండా చంద్రబాబు చేశారని, దేశం మొత్తం మోడీ ఓడి పోవాలని కోరుకుంటుందని, మోడీ అసమర్థ పాలన, నియంతృత్వ ధోరణిని దేశ ప్రజలకు తెలిసేలా చేసిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు.