టీజీ..ఏందీ పిచ్చి మాటలు : పవన్ కల్యాణ్ వార్నింగ్

విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కు జనసేనాని కౌంటరిచ్చిరు. ఏపీలో జనసేన-టీడీపీ కలిస్తే తప్పేంటి అని ఆ దిశగా చర్చలు జరుపుతామని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దనీ.. టీజీ వెంకటేశ్ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిగా మాట్లాడాలనీ..పెద్దమనిషి అనే మర్యాద ఇస్తున్నానని..అటువంటి మాటలు మాట్లాడితే సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాము వద్దనుకుంటేనే టీజీ వెంకటేశ్ కు చంద్రబాబు రాజ్యసభ సీటును ఇచ్చారని..‘నా నోరు అదుపుతప్పితే మీరు ఏమవుతారో ఆలోచించుకోండి..అంటు పవన్ ఘాటుగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు..సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.కర్నూలులో పర్యావరణాన్ని అడ్డగోలుగా కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో తాను మద్దతు ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకోసం టీడీపీ నుంచి తాము ఏదీ ఆశించలేదని గుర్తుచేశారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ, ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ కలిసి పోటీ చేస్తే లేనిది ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటి అని టీజీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. గతంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండేవని.. బీజేపీని ఓడించేందుకు కలిసి పోటీ చేయలేదా అంటూ టీజీ వ్యాఖ్యానించిన క్రమంలో దీనిపై తీవ్రంగా స్పందిచన పవన్ ఘాటు కౌంటరిచ్చారు.