తీసేశారు : టీటీడీ బోర్డు నుంచి సండ్ర తొలగింపు

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకోవాల్సివుంది. అయితే బోర్డు సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య బాధ్యతలు తీసుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టీటీడీ పాలకమండలి నుంచి తొలగించింది.
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులై రెండు నెలలైనా బాధ్యతలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి. టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి.. కాని సండ్ర స్వీకరించకపోవడంతో చర్యలు తప్పలేదు.
తెలంగాణలో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికలకు ముందు ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలవడంతో.. ఆయన్ను సభ్యుడిగా నియమించారు. కొద్దిరోజులుగా ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరుగతోంది. అందుకే పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించలేదనే చర్చ నడుస్తోంది.
సండ్ర టీఆర్ఎస్‌లోకి వెళతారని తేలడంతోనే.. పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై సండ్ర ఇప్పటి వరకు స్పందించలేదు. కాని వీరయ్య పార్టీ మారడం ఖాయమని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.