Asia Cup 2025 Final : నేడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ బిగ్ ఫైట్.. ఫైనల్ పంచ్ ఎవరిదో.. అభిషేక్ వైపే అందరిని చూపు.. ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్..
Asia Cup 2025 Final : ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఇవాళ రాత్రి 8గంటలకు జరగనుంది.

Asia Cup 2025 Final
Asia Cup 2025 Final : ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. దాయాది జట్లు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఇవాళ రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ దశలో, సూపర్-4 దశలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండు సార్లు భారత్ జట్టు విజయం సాధించగా.. ఫైనల్లోనూ పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, ఫైనల్లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పాకిస్థాన్ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.
Also Read: Rinku Singh : తుది జట్టులో లేకున్నా కూడా సూపర్ క్యాచ్ అందుకున్న రింకూ సింగ్.. ఎలాగో తెలుసా?
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అందరి చూపు టీమిండియా యువ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మవైపు ఉంది. ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో 51.50 సగటుతో 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. టీమిండియా మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు.
మరోవైపు.. పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది గత రెండు మ్యాచ్‌లలో అభిషేక్ కు కళ్లెం వేయలేకపోయాడు. అఫ్రిది బౌలింగ్ లో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. మరో విషయం ఏమిటంటే.. పాక్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ అభిషేక్ మొదటి బంతికే బౌండరీలు బాదాడు.. అదికూడా షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లోనే. దీంతో ఫైనల్లో కూడా అభిషేక్ మొదటి బంతికే బౌండరీ కొడతాడా లేదా అనే అంశంపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తానికి అభిషేక్ ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే టీమిండియా విజయం అంత తేలిక అవుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అభిషేక్ శర్మను తక్కువ పరుగులకు ఔట్ చేస్తే పాకిస్థాన్ విజయం తేలిక అవుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్ తదితరులు అభిప్రాయపడ్డారు. అయితే, ఒకవేళ అభిషేక్ తక్కువ పరుగులకే ఔట్ అయినా భారత్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకుంటే భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్ధిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే, అక్షర్ పటేల్ తమ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా కలిగిన ప్లేయర్లు. వీరిలో ఏ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నా భారత్ విజయం ఈజీ అవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు.
భారత జట్టు ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతోపాటు ఇతర జట్లతో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ప్లేయర్లు క్యాచ్‌లు వదిలేస్తూ వస్తున్నారు. ఫైనల్ పోరులో ఈ పరిస్థితి పునరావృతం అయితే.. భారత జట్టు విజయానికి ఆటంకంగా మారే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. మరి ఫైనల్లో అయినా టీమిండియా మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన ఇస్తుందేమో వేచి చూడాల్సిందే.
భారత తుది జట్టు అంచనా..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ తుది జట్టు అంచనా ..
ఫర్హాన్, ఫకార్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), తలాత్, హారిస్, మహ్మద్ నవాజ్, అష్రాఫ్, షహీన్ అఫ్రిది, అబ్రార్, రవూఫ్.