Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ వేళ టీమిండియాపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చిపడేసిన పుజారా

దుబాయ్‌ వేదికగా భారత్‌ మ్యాచులు జరుగుతుండడంపై కొందరు మాట్లాడుతున్న తీరుపై పుజారా స్పందించాడు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ వేళ టీమిండియాపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చిపడేసిన పుజారా

Cheteshwar Pujara About Indias Dubai Advantage

Updated On : March 7, 2025 / 9:53 PM IST

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు చేరుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా, దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడటం భారత జట్టుకు కలిసివచ్చిందనే వాదనలు ఉన్నాయి.

ఇతర జట్లు.. మ్యాచుల కోసం పాకిస్థాన్, దుబాయి మధ్య తరచుగా ప్రయాణిస్తూ వేర్వేరు పరిస్థితులకు అలవాటు పడాల్సి వస్తే, భారత్ మాత్రం ఒకే నగరంలో మ్యాచ్‌లు ఆడటంతో వారికి మ్యాచులు ఈజీ అయిపోయాయని కొందరు విమర్శలు చేస్తున్నారు.

ICC తీసుకున్న ఈ షెడ్యూలింగ్ వల్ల టీమిండియాకు ప్రత్యేక అనుకూలతలు కలిగాయని పలువురు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూ, అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటిపై భారత టెస్ట్ స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా స్పందించాడు.

“ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే షెడ్యూల్ ఖరారైంది. అలాగే భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకూడదనే భద్రతా పరమైన కారణాల వల్ల, ICC, BCCI రెండు కలిసి ఒక తటస్థ వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేశాయి. భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌తో దుబాయ్‌లో ఆడింది. అలాగే దుబాయ్.. పాకిస్థాన్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇది నా దృష్టిలో అన్యాయం కాదు” అని ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా తెలిపాడు.

అంతేకాదు, భారత జట్టు విజయానికి అసలు కారణం దుబాయ్ వేదిక కాదని, జట్టులో ఉన్న గొప్ప ప్రతిభ అని అతడు స్పష్టం చేశాడు. ఇతర జట్లతో పోలిస్తే భారత జట్టులో ఎక్కువ టాలెంటెడ్ స్పిన్నర్లు ఉన్నారని వివరించాడు.

“దుబాయ్ మన హోమ్ గ్రౌండ్ అని కూడా అనలేం. భారత జట్టుకు ఉన్న అసలు అడ్వంటేజ్‌ వారి టాలెంటే. మాకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి నలుగురు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇతర జట్లలో ఎక్కువమంది స్పిన్నర్లు లేరు. అందుకే పాకిస్థాన్‌లో కూడా ఆయా జట్లు సరిగ్గా ఆడలేక సతమతమయ్యాయి” అని తెలిపాడు.

“మా జట్టులో సమతుల్యత ఉంది. మా బ్యాటింగ్ ఆర్డర్ శక్తిమంతంగా ఉంది. హార్దిక్ పాండ్యా లాంటి అద్భుతమైన ఆల్‌రౌండర్ ఉన్నాడు. వీటి వల్లే జట్టు విజయవంతమైంది. టీమిండియా విజయాలకు దుబాయ్ వేదిక అనేది అసలు కారణం కానే కాదు” అని పుజారా వివరించారు.