CSKvsSRH: చెన్నైపై హైదరాబాద్ భారీ విజయం

CSKvsSRH: చెన్నైపై హైదరాబాద్ భారీ విజయం

Updated On : April 17, 2019 / 5:54 PM IST

జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఫలితంగా హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్ల తేడాతో ఓడిపోయింది. 133 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లకే విజయాన్ని రాబట్టింది. కేవలం 4వికెట్లు నష్టపోయి టార్గెట్ చేరుకోగలిగింది. ఓపెనర్లు రెచ్చిపోయి ఆడటంతో డేవిడ్ వార్నర్(50), జానీ బెయిర్ స్టో(61) దాదాపు టార్గెట్ ను చేరుకోగలిగారు. వీరిద్దరూ వెనుదిరగడంతో తర్వాత క్రీజులోకి వచ్చిన వారెవరూ కుదురుకోలేదు. విలియమ్సన్(3), విజయ్ శంకర్(7), దీపక్ హుడా(13), యూసఫ్ పఠాన్(0)లతో ముగించారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సీఎస్‌కేకు ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి వాట్సన్‌(31) నదీమ్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాతి ఓవర్లోనే డుప్లెసిస్‌(45)ను విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేశాడు. హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు.. చెన్నైను ఘోరంగా కట్టడి చేశారు. తాత్కాలిక కెప్టెన్ సురేష్‌ రైనా(13)ను రషీద్‌ ఖాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 

అదే ఓవర్ లో కేదర్‌ జాదవ్‌(1)ను మరో వికెట్ గా రషీద్‌ బోల్తా కొట్టించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బిల్లింగ్స్‌(0) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. వికెట్లు పడగొడుతూ మరో వైపు పరుగులు ఇవ్వకుండా సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివర్లో రాయుడు(25 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌ అహ్మద్‌, శంకర్‌, నదీమ్‌ తలో వికెట్‌ తీశారు.