IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్..!
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను గెలిచి.. టెస్టు సిరీస్‌ల చేదు జాప్ఞకాలను చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ఉంది.

PIC credit @ BCCI Twitter
సుదీర్ఘ ఫార్మాట్‌లో వరుసగా రెండు సిరీసుల్లో ఘోర ఓటములతో డీలా పడింది భారత్ (Team India). అయితే.. తమకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో చెలరేగేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను గెలిచి.. టెస్టు సిరీస్‌ల చేదు జాప్ఞకాలను చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్ (IND vs ENG)తో జరగనున్న తొలి టీ20కి సమరానికి అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది.
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నేతృత్వంలో భారత జట్టు పటిష్టంగానే ఉంది. అయితే.. అందరి దృష్టి ఎక్కువగా సంజూశాంసన్, నితీష్‌కుమార్ రెడ్డి, మహ్మద్ షమీలపైనే ఉంది. తానాడిన చివరి వన్డే సెంచరీతో చెలరేగాడు సంజూశాంసన్. అయినప్పటికి అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. రంజీ మ్యాచ్ ఆడకపోవడమే అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Mohammed Siraj: జట్టులో చోటుకోల్పోవడంతో మహ్మద్ సిరాజ్ కీలక నిర్ణయం.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..
సంజూని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 12 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు అవకాశం ఉంది. దీంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సంజూ దనాధన్ ఇన్నింగ్స్‌లతో రాణిస్తే అప్పుడు సంజూకు చోటు దక్కేఅవకాశం ఉంది. మరి సంజూ టీ20 సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.
అటు బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే ప్రదర్శన చేశాడు తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి. దీంతో ఇంగ్లాండ్ పై ఎలాంటి ఇన్నింగ్స్‌లు ఆడతాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సైతం జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
పునరాగమనం..
గాయం కారణంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తరువాత షమీ మరో మ్యాచ్ ఆడలేదు. చీలమండల గాయంతో భాదపడుతున్న అతడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న తరువాత దేశవాళీ క్రికెట్‌లో రాణించినా.. ఎడమ మోకాలికి వాపు వస్తుండడంతో పునరాగమనం ఆలస్యమైంది.
ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. 34 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. పేసర్ అర్ష్‌దీప్‌తో కలిసి షమీ కొత్త బంతిని పంచుకోనున్నాడు.
బ్రెండన్ మార్గనిర్దేశంలో..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు జోస్ బట్లర్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్ స్టన్ ఒంటి చేత్తో మ్యాచును మలుపు తిప్పగల ఆటగాళ్లు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, జేమీ ఒవర్టన్, అడిల్ రషీద్, మార్క్ వుడ్‌లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే టీమ్ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లాండ్‌కు దూకుడు నేర్పించాడు కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్. ఇప్పుడు పరిమిత ఓవర్ల కోచ్‌గా అతడి సేవలు భారత్‌తో సిరీస్‌తోనే ప్రారంభం కానున్నాయి. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన మెక్‌కలమ్ మార్గనిర్దేశ్యంలో ఇంగ్లాండ్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు స్క్వాడ్‌లు..
టీమ్ఇండియా..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
ఇంగ్లాండ్..
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
తొలి టీ20ని ఎక్కడ చూడొచ్చంటే..?
టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో తొలి టీ20 మ్యాచ్ ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ 1 (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ (SD) ఛానెల్స్‌లో ప్రసారం కానుంది.
ఏ యాప్‌లో స్ట్రీమింగ్ అంటే..?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌ను ప్రముఖ ఓటీటీ డీస్నీ+హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానుంది.