IND vs PAK : భారత్ వర్సెస్ పాక్.. వన్డేల్లో హెడ్-టు-హెడ్ రికార్డ్స్.. ఛాంపియన్స్‌లో ఆధిపత్యం ఎవరిది? యూఏఈలో తోపు ఎవరంటే?
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో ఆధిపత్యం ఎవరిదంటే..

India vs pakistan head to head record in odis and champions trophy
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో రెండు జట్లు ద్వైపాక్షిక్ష సిరీస్‌లు ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది.
ఈ క్రమంలో ఈ మ్యాచ్‌కు ముందు భారత్, పాకిస్తాన్ లు వన్డేల్లో ఎన్ని సార్లు తలపడ్డాయి. దుబాయ్‌లో భారత్, పాక్ ట్రాక్ రికార్డులు వంటి విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ దే పై చేయి..
భారత్, పాక్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో 5 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించగా మూడు మ్యాచ్‌ల్లో పాక్ గెలిచింది. దీంతో రేపటి మ్యాచ్‌లో గెలిచి లెక్కను సరి చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
* ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004లో తలపడ్డాయి. ద్రవిడ్ (67), అగార్కర్ (47) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత మహ్మద్ యూసుఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ హక్ (41)లు రాణించడంతో పాక్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
* 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సారి భారత్, పాక్ లు ఢీకొన్నాయి. షోయబ్ మాలిక్ (128) శతకానికి తోడు మహమ్మద్ యూసుఫ్ (87) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అనంతరం ద్రవిడ్ (76), గంభీర్ (57) హాఫ్ సెంచరీలు బాదినా రైనా (46) పరుగులతో రాణించినా కూడా భారత్ 44.5 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది.
* 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజీలో ముచ్చటగా మూడోసారి భారత్, పాక్ తలపడ్డాయి. అయితే.. ఈ సారి భారత్ విజయం సాధించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా పాక్ 39.2 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో భారత లక్ష్యాన్ని 22 ఓవర్లలో 102 పరుగులకు కుదించారు. ధావన్ (48), కోహ్లీ (22)లు చెలరేగి ఆడడంతో 19.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అందుకుంది.
* 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్‌లు రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజీలో భారత్ విజయం సాధించగా ఫైనల్ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది. గ్రూప్ స్టేజీలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రోహిత్ (91), ధావన్ (68), కోహ్లీ (81 నాటౌట్) లు రాణించారు. లక్ష్య ఛేదనలో పాక్ 164కే కుప్పకూలింది.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ (114) శతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ 158 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా (76) ఒక్కడే రాణించాడు.
యూఏఈలో భారత్, పాక్ ఎన్ని సార్లు తలపడ్డాయంటే..?
యూఏఈలో భారత్, పాకిస్తాన్ జట్లు 28 సార్లు వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 19 మ్యాచ్‌ల్లో గెలవగా, భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
వన్డేల్లో భారత్ vs పాకిస్తాన్ హెడ్-టు-హెడ్ రికార్డు..
భారత్, పాకిస్థాన్ మధ్య తొలి వన్డే 1978లో జరిగింది. అప్పటి నుంచి ఈ చిరకాల ప్రత్యర్థులు 135 సార్లు వన్డేల్లో తలపడ్డారు. పాకిస్తాన్ అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిచింది. 73 మ్యాచ్‌ల్లో పాక్ గెలవగా, 57 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.