ముగిసిన మూడో రోజు ఆట : శతక్కొట్టిన ఎల్గర్, డికాక్.. 117 పరుగులతో వెనుకంజలో దక్షిణాఫ్రికా

  • Published By: sreehari ,Published On : October 4, 2019 / 12:11 PM IST
ముగిసిన మూడో రోజు ఆట : శతక్కొట్టిన ఎల్గర్, డికాక్.. 117 పరుగులతో వెనుకంజలో దక్షిణాఫ్రికా

Updated On : October 4, 2019 / 12:11 PM IST

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ల దాడిని బ్యాటింగ్ తో ధీటుగా ఎదుర్కొన్న క్వింటాన్ డికాక్ (111), డీన్ ఎల్గర్ (160) సెంచరీలతో చెలరేగిపోయారు. పరుగుల వరద పారిస్తూ దక్షిణాఫ్రికా స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 

ఒక దశలో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎల్గర్ దూకుడుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్ లో డికాక్ వెనుదిరిగాడు. భారత బౌలర్లు ఆఖరి సెషన్ లో కట్టడి చేయడంతో సౌతాఫ్రికా కీలక వికెట్లు చేజారాయి. ఆది నుంచి జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించిన డికాక్, ఎల్గర్ నిష్ర్కమించడంతో సౌతాఫ్రికా చేతులేత్తేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో మార్కమ్ (5), బ్రయాన్ (4), బావుమా (18), ముత్తు సామి (12), మహారాజ్ (3) స్వల్ప స్కోరుకే పరిమితం కాగా.. డానే పిడెట్, ఫిలాండర్ డకౌట్ అయ్యారు. 

ఇక డుప్లెసిస్ (55) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించారు.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి ప్రోటీస్ జట్టు 385/8 స్కోరు చేయగా.. ఫిన్ లాండర్ (10), కేశవ్ మహారాజ్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా ఇంకా 117 పరుగుల తేడాతో వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసుకోగా, జడేజా రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.