CSK vs KKR : ధోని ప్లాన్ ఫెయిల్.. కోటీ 70లక్షలు దండగా.. వికెట్లు పడుతున్నాయని..
వికెట్లు త్వరగా పడుతున్నాయని, మెరుగైన స్కోరు సాధించేందుకు ధోని వేసిన ఓ ప్లాన్ ఫెయిల్ అయింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ చెన్నై ఓడిపోయింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు టెస్టు మ్యాచ్‌ను తలపించారు. 120 బంతులు ఆడి కనీసం బంతికో పరుగు చొప్పున 120 పరుగులు చేయలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (4), డేవాన్ కాన్వే (12)లతో పాటు రాహుల్ త్రిపాఠి (16)లు విఫలం అయ్యారు. విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించాడు. ఓ వైపు దూబే (31 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటే అతడికి సహకరించే వారు కరువు అయ్యారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకోవడంతో 13.3 ఓవర్లలో 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది.
CSK vs KKR : ధోని నాటౌటా? చెన్నై కెప్టెన్ వివాదాస్పద ఔట్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..
ఈ దశలో దూబేకు తోడుగా మరో బ్యాటర్ ఉండే మెరుగైన స్కోరు సాధించవచ్చునని భావించిన ధోని తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంపాక్ట్ ప్లేయర్‌గా దీపక్ హుడాను బరిలోకి దించాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో వచ్చిన ఈ ఆల్‌రౌండర్ దూబెకు సహకరించి మెరుగైన స్కోరు సాధిస్తాడని ఫ్యాన్స్ సైతం ఆశించారు.
అయితే.. ఈ తోపు ఆటగాడు డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరా క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ధోని ఇంపాక్ట్ ప్లాన్ పెయిల్ అయింది. చెన్నై జట్టు మరింత కష్టాల్లో పడింది. అటు తొమ్మిదో స్థానంలో వచ్చిన ధోని సైతం నాలుగు బంతులు ఆడి ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. ఆఖరిలో దూబె పోరాడంతో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది.
కాగా.. ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ హుడా చెన్నై సూపర్ కింగ్స్ ను కోటి 70లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో దీపక్ హుడా పై సీఎస్‌కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోటీ 70లక్షలు దండగా అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కోల్‌కతా నైట్‌రైడర్స్ అందుకుంది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్ (18 బంతుల్లో 44) దంచికొట్టాడు. క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23 పరుగులు), కెప్టెన్ అజింక్యా రహానే (17 బంతుల్లో 20 నాటౌట్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్)లు రాణించారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది మూడో విజయం.