IPL2022 DC Vs RR : బట్లర్ బాదుడే బాదుడే.. మూడో సెంచరీ నమోదు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

IPL2022 DC Vs RR : బట్లర్ బాదుడే బాదుడే.. మూడో సెంచరీ నమోదు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

Ipl2022 Dc Vs Rr

Updated On : April 22, 2022 / 11:16 PM IST

IPL2022 DC Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 223 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. కాగా, ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోరు.

రాజస్తాన్ బ్యాటర్లలో ఫుల్ ఫామ్ మీదున్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 65 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో ఏకంగా 9 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఫలితంగా రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ సీజన్ లో బట్లర్ కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.

మరో ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో మూడు సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్‌ రెహ్మాన్ తలో వికెట్ తీశారు.

IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం

ఈ సీజన్ లో బట్లర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఢిల్లీతో మ్యాచ్ లోనూ చెలరేగాడు. మైదానంలో అడుగుపెట్టింది మొదలు బౌండరీల మోత మోగిస్తూ.. ఈ సీజన్‌లో వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. బట్లర్‌తో పాటు మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (54) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో కెప్టెన్‌ సంజూ (46*) కూడా దంచికొట్టడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

బట్లర్ బ్యాటింగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. పాపం ఢిల్లీ బౌలర్లు బంతులు ఎక్కడవేయాలో తెలియక తల పట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (1/47), లలిత్ యాదవ్ (0/41), ముస్తాఫిజర్ (1/43), కుల్‌దీప్ యాదవ్ (0/40), అక్షర్‌ పటేల్ (2-0-21) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్ ఠాకూర్‌ (3-0-29) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్‌ ఎంచుకుని రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాజస్తాన్ లో జోస్‌ బట్లర్, ఢిల్లీలో డేవిడ్ వార్నర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బలాలపరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్తాన్‌ (8) మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ (6) ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్‌ విజయం సాధిస్తే తొలి స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. జట్టు సభ్యులు, సిబ్బందిలో కొందరికి కొవిడ్‌ సోకడంతో ఢిల్లీ కాస్త కంగారు పడింది. కాగా, గత మ్యాచ్‌ లో పంజాబ్‌పై అదరగొట్టేసింది. ఇదే ఊపును రాజస్తాన్‌పైనా కొనసాగిస్తుందో లేదో చూడాలి.

IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్