KKRvsMI: కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం

KKRvsMI: కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం

Updated On : April 28, 2019 / 10:26 PM IST

కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా రెచ్చిపోయింది. 233పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై చివర్లో షాట్ లు సంధించినప్పటికీ లాభం లేకుండా పోయింది. టార్గెట్ చేధించేందుకు హార్దిక్ పాండ్యా (91; 34 బంతుల్లో 6ఫోర్లు, 9సిక్సులు)తో భయంకరంగా రెచ్చిపోయాడు. అటువంటి కీలకమైన వికెట్‌ను గ్యార్నీ చేజిక్కించుకోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా చేజారిపోయింది. 17.6వ ఓవర్‌కు గ్యార్నీ బౌలింగ్ లో రస్సెల్ కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ వెనుదిరిగాడు. ఆ ఒక్కడు మినహాయించి ముంబై జట్టు మొత్తం ఆరంభం నుంచి ఒత్తిడికి లోనై చేతులెత్తేసింది. 

కనీసం పోరాటమైన చూపించని మిగిలిన బ్యాట్స్‌మెన్ 30కి మించని స్కోరుతో పెవిలియన్ చేరారు. డికాక్(0), రోహిత్ శర్మ(12), ఎవిన్ లూయీస్(15). సూర్యకుమార్ యాదవ్(26), కీరన్ పొలార్డ్(20), హార్దిక్ పాండ్యా(91), కృనాల్ పాండ్యా(24), బరీందర్ శ్రాన్(3), రాహుల్ చాహర్(1)మాత్రమే చేయగలిగారు. కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్, హ్యారీ గర్నీ, ఆండ్రీ రస్సెల్ తలో 2వికెట్లు తీయగా, పీయూశ్ చావ్లా ఒక్క వికెట్ పడగొట్టాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ముంబైపై విజృంభించింది. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు 233పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసుకు అర్హత దక్కుతుందనే తపనతో కోల్‌కతా కనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ ఓపెనర్లు నుంచి బౌండరీల వర్షం కురిపించారు. అదుపు చేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ముంబై బౌలర్లకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో 9.3 ఓవర్లకు తొలి వికెట్ చిక్కింది. 

శుభ్‌మాన్ గిల్(76; 45బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు)తో రెచ్చిపోతున్న వేళ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లూయీస్ క్యాచ్ అందుకోవడంతో 9.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ దొరికింది. మరో ఓపెనర్ క్రిస్ లిన్(54; 29 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు)తో 15.2ఓవర్లకు రాహుల్ చాహర్ బౌలింగ్‌లో లూయీస్‌కు క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆండ్రీ రస్సెల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 40 బంతుల్లో 6ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 80 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్(15; 7 బంతుల్లో)చేయడంతో 2వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసింది.