ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్…పోరాడి ఓడిన ఢిల్లీ

Mumbai beats Delhi to win record fifth title ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్స్ లో 5 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. రోహిత్ 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథాన నడిపించాడు. 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఇది ముంబై ఇండియన్స్ ఐదో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డీకాక్-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి విరుచుకుపడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్ ను ధావన్-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు.