Shahid Afridi : ప్రధాన మంత్రి నన్ను అడిగారు.. కెప్టెన్సీ మార్పు.. షాహీన్ అఫ్రిదికి లాబియింగ్ ఇంకా..
Shahid Afridi comments : వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.

Shahid Afridi comments
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. లీగు దశలో 9 మ్యాచులు ఆడిన పాకిస్థాన్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడంతో సెమీస్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. దీంతో పాకిస్థాన్ జట్టు పై ఆ దేశ అభిమానులు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్లు సైతం విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్సీకి బాబర్ ఆజాం రాజీనామా చేశాడు.
బాబర్ ఆజాం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహీన్ అఫ్రిదిని కెప్టెన్లుగా నిమయించింది. మరో రెండు మూడు నెలల వరకు పాకిస్థాన్ వన్డే క్రికెట్ ఆడే అవకాశం లేదు. దీంతో ఈ ఫార్మాట్ కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, షాహీన్ అఫ్రిది మామ అయిన షాహిద్ అఫ్రిది కెప్టెన్ మార్పు గురించి సామా టీవీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రధానిని కలిసినప్పుడు..
ప్రధాన మంత్రిని కలిసినప్పుడు క్రికెట్‌కు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. ఆ సమయంలో కెప్టెన్సీ మార్పు విషయమై ప్రస్తావన రాగా.. ఇంత త్వరగా కెప్టెన్‌ని మార్చాల్సిన అవసరం లేదని తాను చెప్పినట్లు షాహిద్ అఫ్రిది తెలిపాడు. మిగతా ఫార్మాట్ల సంగతి ఎలా ఉన్నా సరే టెస్టు కెప్టెన్‌గా బాబరే ఉండాలని చెప్పాను. వైట్ బాల్ కెప్టెన్‌ను మార్చాలనుకుంటే అందుకు మహ్మద్ రిజ్వాన్ తగిన వాడని ప్రధానితో అన్నట్లుగా షాహిద్ అఫ్రిది చెప్పాడు.
పీసీబీ చైర్మన్‌తో ఇదే విషయమై మాట్లాడాను. రెడ్ బాల్ కెప్టెన్‌గా బాబర్ ఆజాంను కొనసాగించాలని సూచించాను. మహ్మద్ రిజ్వాన్‌కు వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే బాగుందని అతడితో చెప్పాను. పీఎస్ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్) ముల్తాన్ సుల్తాన్స్ కూడా కెప్టెన్‌గా రిజ్వాన్ ఆకట్టుకున్నాడని, అతడికి జట్టును నడిపించే సత్తా ఉందని అన్నట్లు షాహిద్ అఫ్రిది తెలిపాడు.
షాహీన్ అఫ్రిదికి టీ20 కెప్టెన్సీ..
మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది లాబియింగ్ చేయడంతోనే షాహీన్ అఫ్రిదికి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. దీనిని షాహిద్ అఫ్రిది ఖండించాడు. షహీన్ జట్టును నడిపించడం తనకు ఇష్టం లేదన్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లలో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్నారు. కెప్టెన్‌గా షాహీన్ ను నియమించడం మహ్మద్ హఫీజ్, పీసీబీ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. వాస్తవానికి కెప్టెన్సీకి షాహీన్ దూరంగా ఉండాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అఫ్రిది అన్నాడు.
“Making Shaheen a captain is entirely Hafeez’s and the PCB chairman’s decision. I have nothing to do with that. I was against it even when he took over Lahore’s captaincy. I told the Chairman not to remove Babar yet. Even if you do, make Rizwan a captain then”, @SAfridiOfficial pic.twitter.com/efL4TqdVlw
— Ihtisham Ul Haq (@iihtishamm) November 16, 2023