DC vs SRH, IPL 2020: ఢిల్లీపై గెలిచిన హైదరాబాద్.. సీజన్‌లో తొలి విజయం

  • Published By: vamsi ,Published On : September 29, 2020 / 11:38 PM IST
DC vs SRH, IPL 2020: ఢిల్లీపై గెలిచిన హైదరాబాద్.. సీజన్‌లో తొలి విజయం

Updated On : September 30, 2020 / 6:58 AM IST

ఐపీఎల్ 13సీజన్ 11వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. నేటి మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు, చివరి స్థానంలో జట్టుకు మధ్య జరగగా.. టోర్నమెంట్‌లో విజయం రుచి చూడని హైదరాబాద్‌ తొలి విజయం నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తొలి ఓవర్ ఐదవ బంతికి భువనేశ్వర్ బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా వికెట్ పడిపోగా.. రెండో వికెట్‌కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ నెమ్మదిగా 40 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అయ్యర్ 17 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 28, శిఖర్ ధావన్ 34, హెట్మోయర్ 21 పరుగులు చేశారు.



రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ తరఫున అధ్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.



తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ రోజు 33 బంతుల్లో 45 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా నిలిచిన వార్నర్-బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు.

వార్నర్‌ను లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అవుట్ చేయగా.. అతని వికెట్ పడిపోయిన తరువాత, మనీష్ పాండే క్రీజులోకి వచ్చాడు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడుతున్న కేన్ విలియమ్సన్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆయనతో పాటు ఓపెనర్ బెయిర్‌స్టో 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రబాడా, అమిత్ మిశ్రా ఢిల్లీ తరపున చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Match 11. It’s all over! Sunrisers Hyderabad won by 15 runs https://t.co/iERYiZMI4B #DCvSRH #Dream11IPL #IPL2020

— IndianPremierLeague (@IPL) September 29, 2020