చిన్న వయస్సులోనే : న్యూజిలాండ్‌లో చనిపోయిన భారత క్రికెటర్

ప్రాణాలు పణంగా పెట్టి మ్యాచ్ ఆడటమే ప్లేయర్లకు తెలిసిన పని. కానీ, ప్రాణాలకు తెగించి ఆడమని కాదు దాని ఉద్దేశ్యం. కివీస్ గడ్డపై మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు భారత ఆల్‌రౌండర్. న్యూజిలాండ్‍కు చెందిన గ్రీన్ ఐస్‌ల్యాండ్ క్రికెట్ క్లబ్ సెకండ్ గ్రేడ్ జట్టులో సభ్యుడిగా ఉన్న హరీశ్ గంగాధరన్ శనివారం మ్యాచ్ ఆడుతూ మధ్యలోనే మృతి చెందాడు. తమ జట్టు ఫీల్డింగ్ చేస్తుండటంతో పది ఓవర్ల పాటు మైదానంలో నిల్చొని ఉన్న హరీశ్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు.
జట్టు సహచర ఆటగాళ్లతో శ్వాస అందడం లేదని చెప్తూనే క్షణాల్లో మృతి చెందాడు. అప్పటికే అప్రమత్తమైన వైద్య బృందం గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. గంగాధరన్‌కి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళలోని కొచ్చికి చెందిన హరీశ్ గంగాధరన్ ఐదేళ్ల క్రితమే వివాహం చేసుకునేందుకు న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. మ్యాచ్ లేని రోజుల్లో ఒటాగో డైలీ టైమ్స్ పబ్లిషర్స్ అనే ప్రెస్‌లో నైట్ డ్యూటీ చేస్తుండేవాడు.
హరీశ్ జట్టులో కీలకంగా వ్యవహరించేవాడని, బ్యాటింగ్‍లోనూ, బౌలింగ్ లోనూ చక్కటి ప్రతిభను కనబరిచేవాడని జట్టు సభ్యులు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లోని గంగాధరన్ నివాసానికి వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు.