Telangana Politics: అభ్యర్థుల ఖరారులో కారు టాప్ గేర్.. జోరు చూపించని కాంగ్రెస్, బీజేపీ.. కారణమేంటి?

కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి.

Telangana Politics: అభ్యర్థుల ఖరారులో కారు టాప్ గేర్.. జోరు చూపించని కాంగ్రెస్, బీజేపీ.. కారణమేంటి?

congress bjp yet to finalise Telangana candidate list

Updated On : August 24, 2023 / 1:43 PM IST

Telangana Congress: తెలంగాణలో భిన్నమైన రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీ కంటే ముందుగా ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన ప్రతిపక్షాలు కునికిపాట్లు పడుతున్నాయి. నాలుగు మినహా ఒకేవిడతలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల గోదాలోకి దిగిపోయింది గులాబీ సైన్యం. ఇక అధికారంపై ఎన్నో ఆశలు పెంచుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది.. మరో ప్రతిపక్షం బీజేపీ (BJP Telangana) అభ్యర్థుల ఖరారుపై ఇంకా కసరత్తే ప్రారంభించిన దాఖలాలు కన్పించడం లేదు. సాధారణంగా ఎన్నికల ముందు ఎక్కడైనా ప్రతిపక్షాలే సమర గర్జన చేస్తుంటాయి. అధికార పార్టీపై పోరాడుతుంటాయి. కానీ తెలంగాణలో పూర్తిగా రివర్స్ రాజకీయం నడవటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలు ఎన్నికల రేసులో కాంగ్రెస్, బీజేపీ వెనకబడిపోడానికి కారణమేంటి? బీఆర్ఎస్ (BRS Party) స్పీడ్‌ను అందుకోవటంలో ఆ రెండు పార్టీలకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి?

ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ పై రణ నినాదాలు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు రాబోయేది తమ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి. టిక్కెట్ల కేటాయింపు తర్వాత గులాబీదళంలో లుకలుకలు మొదలవుతాయనే బీజేపీ, కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. ఒకటీ, అరా తప్పా పెద్దగా అసంతృప్తులు లేకుండా గులాబీబాస్ జాగ్రత్తలు తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ అధికార బీఆర్ఎస్ స్పీడ్ అప్పుడే పెంచేసింది. ఒకే విడతలో 115 నియోజకవర్గాలకు 114 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రెండు చోట్ల పోటీ చేయనుండటంతో మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇంకా ఖరారు చేయాల్సిన స్థానాలు కేవలం నాలుగే ఉన్నాయి. వీటిలో నర్సాపూర్, జనగాం స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోయనా.. ఆ పార్టీలో ఓ స్పష్టత వచ్చింది. ఇక మిగిలిన రెండు స్థానాలను ఆ పార్టీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. గోషామహల్లో బరిలో దిగే బీజేపీ అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇక నాంపల్లిలో మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేనే ఉండటంతో.. ఆ సీటులో నామ్ కే వాస్తే పోటీ ఉండబోతోంది. మొత్తానికి అభ్యర్థుల ప్రకటనతో కారును టాప్ గేర్కు తీసుకుపోయిన కేసీఆర్.. పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లిపోయారు. ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు విడుదల చేసినా రెడీ అన్నట్లు అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధం చేసేశారు గులాబీబాస్.

Also Read: ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ : కోదండరాం

ఇక ప్రతిపక్షాల్లో ఈ సన్నద్ధత అస్సలు కనిపించడం లేదు. రెండు ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్‌లో దరఖాస్తుల స్వీకరణతో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. పోటీకి ఆసక్తి చూపుతున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది హస్తం పార్టీ. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలించి.. ఓ జాబితా తయారు చేసి పార్టీ అధిష్టానానికి నివేదించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ్యులుగా ఉండే స్టీరింగ్ కమిటీ.. రాష్ట్రస్థాయిలో అభ్యర్థులు వడబోత కార్యక్రమం చేపట్టనుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఒక్కో నియోజకవర్గం నుండి ఇద్దరు అభ్యర్థుల పేర్లను హైకమాండ్‌కు పంపి.. అక్కడనించి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత టిక్కెట్లు ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది.

Also Read: మల్కాజిగిరి బరి నుంచి మైనంపల్లిని తప్పించడం ఖాయమా?

ఇక బీజేపీలో కూడా కాంగ్రెస్ టైపులోనే ఓ కమిటీ ఉంది. దాని పేరు ఎలక్షన్ కమిటీ.. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఇన్‌చార్జిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో సభ్యులు ఎవరో ఇంకా నిర్ణయించలేదు కమలదళం. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అంటూ ఈటల రాజేందర్ (Eatala Rajender) అధ్యక్షుడిగా మరో కమిటీ వేసినా.. బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదు. ఎలక్షన్ కమిటీయే అభ్యర్థుల ఎంపిక చూస్తుందని బీజేపీ వర్గాల సమాచారం. ఈ కమిటీ ఇన్‌చార్జిగా ప్రకాశ్ జవదేకర్ ఒకసారి హైదరాబాద్ వచ్చివెళ్లారేకాని అభ్యర్థుల ఎంపికపై ఎలా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెబుతున్నారు. అధికార పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోని దిగేసినా.. బీజేపీలో ఇంకా ఎన్నికల జోష్ కన్పించడం లేదు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పొత్తులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వామపక్షాలు.. కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో ఒంటరిపోరు చేయాలా.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాం కనుక.. తెలంగాణాలోనూ కాంగ్రెస్తో కలిసి వెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో వామపక్షాల దారేంటన్నది సర్వత్రా ఆసక్తిరేపుతోంది.

Also Read: భద్రాచలంలో పొలిటికల్ ఫైట్.. రేగా కాంతారావు మాట్లాడకుండా మైక్ లాక్కున్న పొదెం వీరయ్య

ప్రస్తుతానికి వామపక్షాల సంగతి అలా ఉంచితే బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై జోరు చూపించలేకపోవడానికి రకరకాల కారణాలు చూపుతున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఢిల్లీ చేతుల్లో ఉండిపోవడంతో ఎన్నికల రణంలో వెనకబడినట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో అభ్యర్థులపై కుస్తీ పట్టడం.. ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో మరోసారి కసరత్తు చేయడంతోనే సగం సమయం కరిగిపోతుందంటున్నారు. ఫలితంగా ఎన్నికల వ్యూహాలు, ప్రచారం ఆలస్యమవుతుందని.. అప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతుందని చెబుతున్నారు.

హస్తిన రాజకీయమే రెండు జాతీయ పార్టీలకు అడ్డుగా మారగా, బీఆర్ఎస్‌లో వడపోత అంతా హైదరాబాద్ కేంద్రంగానే ముగియడం ఆ పార్టీకి కలిసివస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రెండు పార్టీలూ బీఆర్ఎస్ నేతల వలసలపై ఆశతో ఎన్నికల సన్నద్ధతపై నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తోంది. అదేసమయంలో అదునుచూసి దెబ్బ తీయడంలో దిట్టైన సీఎం కేసీఆర్ సిట్టింగ్ల్లో 90 శాతం మందికి సీట్లిచ్చి ప్రత్యర్థులను ముందుగానే మట్టికరిపించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో బాలరిష్టాలే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతున్నాయి.