రేవంత్ రెడ్డి అరాచకాలకు కాంగ్రెస్‌లో కలకలం

అరాచకాలు.. అక్రమాలు.. పదవి కోసం పాకులాటలు.. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీనే పణంగా పెట్టేసే ప్రయత్నాలు.. ఇలా ఒక్కొక్కటిగా ఎంపీ రేవంత్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి.. కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. తమలో ఒకడని మద్దతు పలకడానికి వెళ్లిన వాళ్లు కూడా.. తమనే మింగేసే రకం అని తెలుసుకుని సైడ్ అయిపోతున్నారు. రేవంత్ వ్యవహారాన్ని తేల్చాల్సిందేనంటూ హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చినా రేవంత్ రాజకీయం మారలేదు. ఇప్పుడే అదే.. హస్తం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఒంటెద్దు పోకడలతో పార్టీ పరువు తీసేలా రేవంత్ వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే సీనియర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏ అంశంపై పార్టీ పరంగా పోరాటం చేయాలన్నా.. ముందు పార్టీలో చర్చించాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందరి నిర్ణయం మేరకే నేతలు నడుచుకోవాలి తప్ప.. రేవంత్‌లా వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం సరికాదంటూ మండిపడుతున్నారు.
రేవంత్ రాజకీయం చేయాలనుకున్న జీవో 111 ను… తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీనే ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా తెరపైకి తెచ్చారు వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు. ఈ విషయంలో రేవంత్‌కు పార్టీ నేతలు మద్దతిస్తే.. అతనితో పాటే.. పార్టీ కూడా మునగాల్సి వస్తోందంటూ హెచ్చరిస్తున్నారు.
టీడీపీలో ఉన్నప్పుడూ సీనియర్లందర్నీ సైడ్ చేసేసి.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులోకి వచ్చేసినప్పుడూ ఇలానే వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానంటూ.. ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపారు. ఈ కేసులో అడ్డంగా దొరికి పోయి… జైలు పాలయ్యారు. ఆ దెబ్బతో తెలంగాణలో టీడీపీ ఖతం అయిపోయింది. రేవంత్ మాత్రం ఆ కేసును చూపించి హైకమాండ్ నుంచి లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి.
ఇక పార్టీ పరిస్థితి దిగజారాక.. తట్టాబుట్టా సర్దుకుని కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయారు. టీడీపీని నిండా ముంచేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీని కూడా తన ఉచ్చులోకి లాక్కోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. పీసీసీ పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన రేవంత్.. ఇప్పటికే ఢిల్లీలో మేనేజ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెచ్చుకోగలిగారు. ఇప్పుడు ఆయన టార్గెట్ పీసీసీ పోస్ట్. దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే గోపన్‌పల్లిలో రేవంత్ భూ దందా బయటపడింది.
స్థానికుల ఫిర్యాదులపై స్పందించి రెవెన్యూ అధికారులు చేసిన దర్యాప్తులో.. రేవంత్ అక్రమాల పుట్ట పగిలింది. వందల కోట్ల రూపాయల విలువైన దళితులు, ప్రభుత్వ భూములను రేవంత్ అడ్డగోలుగా హస్తగతం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీ చిన్నదాన్ని చాంతాండంత చేసి పబ్బం గడుపుకునే రేవంత్‌రెడ్డి.. గోపన్‌పల్లి దందాలో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోవడంతో.. నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది.
గోపన్‌పల్లి దందాపై రేవంత్ నుంచి ఇంతవరకూ సమాధానమే లేదు. పైగా దాని నుంచి తప్పించుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వంపై పోరాడుతోంది తానేనని ఢిల్లీలో చెప్పుకోవడానికి.. జీవో 111ను సడన్‌గా తెరపైకి తెచ్చారు. పార్టీలో చర్చించకుండానే గండిపేట వెళ్లి హడావుడి చేయబోయారు. ఇక్కడే రేవంత్ అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్ అయ్యారు. చట్టవిరుద్ధంగా డ్రోన్ కెమెరాతో కేటీఆర్ ఫామ్ హౌస్‌ను వీడియోలు తీయించారు.
దీనిపై కేసు నమోదు కావడంతో మరో నాటకానికి తెరలేపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అరెస్ట్ అయితే.. లోక్‌సభలో తన అంశం ప్రస్తావనకు వస్తుందని అతిగా ఊహించుకుని.. పోలీసులకు లొంగిపోయారు. కానీ, రేవంత్ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. అప్పటికే రేవంత్ తీరుపై, భూదందాలపై కాంగ్రెస్ హైకమాండ్‌కు రిపోర్ట్ కూడా వెళ్లడంతో.. ఢిల్లీలో ఈ వ్యవహారంపై పెద్దగా స్పందనే లేదు. దీంతో.. సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు రేవంత్ అనుచరులు.
జీవో 111కు టీపీసీసీ పదవికి లింక్ పెట్టి ప్రచారం చేయడంపైనా.. కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు. కోర్‌కమిటీలో తక్షణం రేవంత్ వ్యవహారాన్ని తేల్చాల్సిందేనంటున్నారు. రేవంత్ విషయంలో ఇప్పటికైనా మేల్కోకపోతే.. టీడీపీలానే కాంగ్రెస్‌ను కూడా ముంచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.
See Also | Corona మ్యాప్ షేర్ చేస్తున్నారా.. హ్యాకర్ల ట్రాప్‌లో పడినట్లే