Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూసి నిర్ణయం తీసుకోండి- రేవంత్ రెడ్డి

బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. Revanth Reddy - CM KCR

Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూసి నిర్ణయం తీసుకోండి- రేవంత్ రెడ్డి

Revanth Reddy - CM KCR (Photo : Google)

Updated On : September 18, 2023 / 7:58 PM IST

Revanth Reddy – CM KCR : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభపైన, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపైన వారు చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, మరో వంద రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజే 6 గ్యారెంటీ స్కీమ్ ల అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”నీళ్ళు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదు. అది కేసీఆర్ స్లోగన్. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం, సమానత్వం. CWC సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు. 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో CWC సమావేశాలు జరిగాయి.

నేను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు CWC సమావేశాలు హైదరబాద్ లో జరగడం సంతోషంగా ఉంది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చించాం. CWC సమావేశాల్లో ఇండియా కూటమి పాత్రపై చర్చ జరిగింది. వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. మరో వంద రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజే 6 గ్యారెంటీ స్కీమ్ ల అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం.

Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియాని గౌరవంగా స్వాగతించి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విజ్ఞత ఉన్నట్టు అనిపించేది. బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. మేం మీటింగ్ పెట్టుకోగానే ఇంట్లో పండుకున్న బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఏకమై కుట్రలు చేశాయి. మా సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ మూడు పార్టీలు ఒక్కటే.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వప్నం అని సోనియా అన్నారు. ప్రజలకి ఏం చేస్తామో క్లియర్ గా చెప్పాం. అదే పాజిటివ్ కోణంలో ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూసి నిర్ణయం మీరే తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాలు చూడండి. తాడి చెట్టంత పెరిగితే మెదడు మోకాలిలో ఉంటుందని హరీశ్ రావుని చూస్తే అర్థమైంది.

ఉచిత విద్యుత్ విషయంలో కూడా వేరే రాష్ట్రాల్లో ఇవ్వరా అన్నారు. మేం ఇక్కడ మాట ఇచ్చి చేసి చూపించాం. బుర్ర లేకుండా వితండవాదం చేయవద్దని హరీశ్ రావుకు సూచిస్తున్నా. ధరణి రద్దు చేస్తాం. ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఏం లాగా మారింది. దొరల ధోరణికి ప్రతిరూపమే ధరణి. తెలంగాణలో భూసమస్య ప్రధానమైంది. భూమి కోసమే సాయుధపోరాటం జరిగింది. కేటీఆర్ ట్వీట్ కేటీఆర్ రాయలేదు.

Also Read..Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా

దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. దేశం గురించి బీజేపీకి ఏం తెలుసు? వాళ్లకేం సంబంధం? మత విద్వేషాలతో రాజకీయాలు చేసే బీజేపీకి భరతమాత గురించి మాట్లాడే అర్హత ఉందా? ఉద్యమకారులకు భూమి ఇవ్వడం అంటే వాళ్ళని గుర్తించి గౌరవం ఇవ్వడమే. బండి సంజయ్, రాజ్ గోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కిషన్ రెడ్డి స్పందించాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.