Harish Rao : హైకోర్టులో మాజీమంత్రి హరీశ్ రావు క్వాష్ పిటిషన్..
నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో తనను ఇరికించారని హరీశ్ రావు తెలిపారు.

BRS MLA Harish Rao
Harish Rao : మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. రాజకీయ కక్షతో తనపై కేసు నమోదు చేశారని హరీశ్ రావు చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో తనను ఇరికించారని హరీశ్ రావు తెలిపారు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీశ్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో డిసెంబర్ 1న హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యవహారంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారంటూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కొన్ని సెక్షన్ల కింద హరీశ్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
రేపు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది. తన పిటిషన్ లో ప్రధానంగా పలు అంశాలను హరీశ్ రావు పొందుపరిచారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టవేయాలంటూ తన క్వాష్ పిటిషన్ లో హరీశ్ రావు పేర్కొన్నారు.
రేపు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దీనిపై విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఈ పిటిషన్ కు సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు చూస్తున్నారు. మరోవైపు చక్రధర్ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..