Gossip Garage : మేడమ్ చాలా సింపుల్.. కానీ, తేడా వచ్చిందో.. కాంగ్రెస్ నేతలకు కొత్త ఇంచార్జ్‌ పెట్టిన రూల్స్ ఏంటి?

అసలే రాహుల్ కోటరీ. ఏ మాత్రం తేడా వచ్చిన ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు.

Gossip Garage : మేడమ్ చాలా సింపుల్.. కానీ, తేడా వచ్చిందో.. కాంగ్రెస్ నేతలకు కొత్త ఇంచార్జ్‌ పెట్టిన రూల్స్ ఏంటి?

Updated On : March 2, 2025 / 12:12 AM IST

Gossip Garage : హంగూ లేదు.. ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్..చిన్న లగేజీతో ట్రైన్‌లో వచ్చేశారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్‌. కాన్వాయ్‌, సెక్యూరిటీ అన్న ముచ్చటే లేకుండా ఓ సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు మీనాక్షి నటరాజన్. వచ్చీ రావడంతోనే తన మార్క్‌ ఏంటో చూపించారు. నేను చాలా సింపుల్‌ నేనింతే..ఇట్లే ఉంటా..నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స్టేట్ లీడర్లకు కొత్త ఇంచార్జ్‌ పెట్టిన రూల్స్ ఏంటి..?

కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ అంటే చాలా కీలకం. అందుకే ఇంచార్జ్‌గా ఎవరు వచ్చినా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఫ్లెక్సీలు, స్వాగతాలు, కాన్వాయ్‌లు పెడుతూ హంగామా చేస్తుంటారు లీడర్లు. అలా ఢిల్లీ నుంచి ఎవరు తెలంగాణ ఇంచార్జ్‌గా వచ్చిన వారు హవా చూపిస్తుండే వారు. కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రూటే కాస్త సెపరేటు. మేడమ్ చాలా సింపుల్. ఆడంబరాలకు అందనంత దూరంగా ఉంటున్నారు.

నా కోసం రైల్వే స్టేషన్ దాకా ఎవరు రావొద్దు, నా బ్యాగును కూడా ఎవరు మోయొద్దు..
నిన్న మొన్నటి వరకు తెలంగాణకు ఇంచార్జ్‌లుగా వ్యవహరించిన వారంతా ఒక ఎత్తైతే..ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాస్త డిఫరెంట్. పూర్తి గాంధేయవాద సిద్ధాంతాలతో నడుచుకుంటారామె. చాలా నిరాడంబరంగా ఉంటారు.

Also Read : కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో బీఎస్పీ.. ఆ పట్టభద్రుల సీటులో గెలుపెవరిది?

కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అంటే ఫ్లైట్‌ లో వస్తారని అనుకుంటారు. కానీ మీనాక్షి నటరాజన్‌ సాదాసీదాగా తెలంగాణలో ల్యాండ్ అయిపోయారు. హంగూ ఆర్భాటం లేకుండా భుజానికి చిన్న హ్యాండ్ బ్యాక్ వేసుకుని.. ట్రైన్‌లో వచ్చేశారు. తన కోసం రైల్వే స్టేషన్ దాకా ఎవరు రావొద్దని..తన బ్యాగును కూడా ఎవరు మోయొద్దని ముందే స్ట్రిక్ట్‌ ఆర్డర్స్ ఇచ్చేశారు.

ఫ్లెక్సీలు పెడితే ఎన్నికల్లో గెలవలేము..
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించక ముందే ఇక్కడి నేతలకు ముందస్తుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనను రిసీవ్ చేసుకోవడానికి నేతలు ఎవరు పెద్ద ఎత్తున రాకూడదని..గాంధీభవన్‌లో తనకు స్వాగతం పేరుతో ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయొద్దని కూడా చెప్పేశారు. అంతేకాదు గాంధీభవన్ ఆవరణలో సోనియా, రాహుల్ గాంధీ మినహా మరెవరి ఫ్లెక్సీలు ఉండకూడదని ఆదేశించారట.

గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో కూడా మరిన్ని విషయాలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు, సన్మానాలు అసలే వద్దని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు పెడితే ఎన్నికల్లో గెలవలేమని ప్రజల్లోనే ఉంటేనే గెలుస్తామన్నారు.

Also Read : తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ ..

ప్రతి శనివారం ఉపవాసం, మౌనవ్రతం..
రాహుల్ కోటరీలో చాలా కీలకమైన నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ పూర్తి గాంధేయ వాది. భుజాన ఒక నూలు సంచి..అందులో రెండు మూడు జతల బట్టలు. ఆ డ్రెస్సులు కూడా సాదాసీదాగా ఉంటాయి. ఇక రాకపోకలు చాలావరకు రైలు మార్గాల ద్వారానే ప్రయాణిస్తారు. అత్యవసరమైతేనే తప్ప ఫ్లైట్‌లో ట్రావెల్‌ చేయరు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ..ప్రతి శనివారం ఉపవాసం, మౌనవ్రతం పాటిస్తారు.

ఇలా ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌లుగా వచ్చిన అందరితో పోలిస్తే మీనాక్షి నటరాజన్ చాలా స్పెషల్‌. దీంతో ఆమెను ఎలా డీల్‌ చేయాలో అర్థం కాక నేతలు తర్జనభర్జన పడుతున్నారట. అసలే రాహుల్ కోటరీ. ఏ మాత్రం తేడా వచ్చిన ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు. ఇలా వస్తూ వస్తూనే తన సింప్లిసిటీ, లోప్రొఫైల్, స్ట్రిక్ట్‌ ఆర్డర్స్‌తో హడలెత్తిస్తున్నారు మీనాక్షి నటరాజన్.