ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హరీశ్ రావు హాజరు.. లోపలికి ఒక్కరినే అనుమతించిన పోలీసులు
ఆయనను ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు.
Harish Rao (Image Credit To Original Source)
- హరీశ్ రావును విచారిస్తున్న సిట్
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ
- విచారిస్తున్న ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. హరీశ్ రావు ఒకరినే సిట్ ఆఫిస్ లోపలికి అనుమతించారు. ఆయనను ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు.
కాగా, హరీశ్ రావుతో పాటు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. హరీశ్ రావు వెంట వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను సిట్ ఆఫిస్ వద్ద నుంచి పోలీసులు వెనక్కి పంపుతున్నారు.
Also Read: అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇచ్చారు: హరీశ్ రావు
ఎన్ని కేసులు పెట్టినా పోరాటాన్ని వదిలిపెట్టం: హరీశ్
సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మాట్లాడారు. “ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి.
ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా.
ధైర్యంగా వెళ్తున్నాం.. అడిగిన వాటికి సమాధానం చెబుతాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెంపఛెళ్లుమనేలా సమాధానం చెప్పింది. నువ్వు ఎన్ని గిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టం.
నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటం. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన కార్యకర్తలం.. ఉద్యమకారులం.. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలిపెట్టం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా పోరాటం జరుపుతూనే ఉంటాం” అని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు..
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటామని హరీశ్ రావు చెప్పారు. “మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు. రెండేళ్లలో నువ్వు ఈ కేసులో చేసింది ఏముంది? ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతావు. ఇప్పటికే కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు అన్నావు, విచారణ అన్నావు, కమిషన్ అన్నావు.
చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ప్రజలకు కావాల్సింది రైతు బందు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, నామీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవు” అని హరీశ్ రావు విమర్శించారు.
