హైదరాబాద్‌కు వాన గండం : మరో రెండు రోజులు వర్షాలు, 24 మంది మృతి

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 06:42 AM IST
హైదరాబాద్‌కు వాన గండం : మరో రెండు రోజులు వర్షాలు, 24 మంది మృతి

Hyderabad Heavy rains : హైదరాబాద్‌కి అప్పుడే వాన గండం వదల్లేదు. మరో వాయుగుండం విరుచుకుపడేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం వల్ల మరో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



హైదరాబాద్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలో పలు చోట్ల నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. కొండాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, ఖైరతాబాద్, మియాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.



భారీ వర్షాలతో పాటు బలమైన ఈదులు గాలులతో ఖైరతాబాద్ లోని రైల్వే ట్రాక్ వద్ద పెద్ద చెట్టు నేలకూలింది. ఘటన స్థలానికి చేరుకున్న DRF సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగిస్తున్నారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.



బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్​తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. రెండు, మూడు రోజులుగా నాన్‌ స్టాప్‌గా వర్షాలు కురవడంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ మహానగరాన్ని ముంచేసింది. పలు కాలనీలు జలమయమై వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.



పల్లె చెరువులో 6 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపిన జీహచ్ఎంసీ అధికారులు మరో 9 మంది గల్లంతైనట్లు వెల్లడించారు. పాతబస్తీలో గోడ కూలి 9 మంది మృతి చెందారు. అటు, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు రావడంతో బాలుడు మృతి చెందారు. బంజారాహిల్స్‌లో సెల్లార్ నీటి తోడేందుకు మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో డాక్టర్ సతీష్‌రెడ్డి మృతి చెందారు.



నాగోల్ బండ్లగూడ మల్లికార్జున నగర్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోస్టుమాన్ గల్లంతయ్యారు. హస్మత్‌పేట్ అంజయ్యనగర్‌లో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోగా.. మూడు గంటల తరువాత క్షేమంగా బయటపడ్డాడు. శాలిబండలో ఓ భవనం గోడ కూలిన ప్రమాదంలో మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది.